
ప్రక్షాళన దిశగా కడప కేంద్ర కారాగారం
కడప అర్బన్ : కడప కేంద్ర కారాగారంలో సెల్‌ఫోన్‌లు దొరుకుతున్నాయని, నిబంధలకు విరుద్ధంగా కొందరు అధికారులు, సిబ్బంది ప్రవర్తిస్తున్నారని వస్తున్న ఆరోపణలపై జైళ్ల శాఖ డీజీ అంజనీకుమార్ ఆదేశాల మేరకు ప్రక్షాళన చేసేందుకు తనను విచారణకు పంపించారని జైళ్లశాఖ రాయలసీమ రేంజ్ ఇన్‌చార్జి డీఐజీ ఎం.ఆర్ రవికిరణ్ తెలిపారు. బుధవారం ఆయన తమ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తమ విచారణలో సెల్‌ఫోన్‌లు బయటనుంచి విసిరేస్తున్నారని తెలుసుకున్నామన్నారు. సెల్‌ఫోన్‌లు దొరికిన ప్రతిసారీ పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించి విచారణ చేసి వుంటే బాగుండేదన్నారు. కొన్ని సందర్భాలలోనే ఫిర్యాదులు చేశారని ఇందుకు బాధ్యులైన వారిపై ప్రాథమికంగా విచారణ చేసి నివేదికలను డీఐజీకి పంపించామన్నారు. డీజీ దేశాల మేరకు ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ సూపరింటెండెంట్‌లు, జైలర్స్ ఇద్దరు, ముగ్గురు వార్డర్లను సస్పెండ్ చేశారన్నారు. కారాగార నిబంధనల మేరకు ఖైదీలను బ్యారక్‌లలో వుంచి, సెల్‌ఫోన్‌లు బయట నుంచి రాకుండా వుండేందుకు పకడ్బందీగా చర్యలను చేపడుతున్నామన్నారు. ఇంకా విచారణ కొనసాగుతోందన్నారు.
రాయలసీమ జైళ్లశాఖ ఇన్‌చార్జి
డీఐజీ ఎం.ఆర్ రవికిరణ్