
హామీలు కొండంత, చేసింది గోరంత
కూటమి ప్రభుత్వంపై
యూటీఎఫ్ నేతల విమర్శ
కడప ఎడ్యుకేషన్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు కొండంత అని, చేసింది గోరంత మాత్రమేనని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మిరాజా, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదన విజయకుమార్, పాలెం మహేష్ బాబులు విమర్శించారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించుకుంటే పోరుబాట తప్పదని హెచ్చరించారు. ఆదివారం కడపలోని యూటీఎఫ్ భవన్‌లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి నేతలు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఉద్యోగ, ఉపాధ్యాయులు సహకరించారన్నారు. ఉద్యోగుల అండదండలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, అధికారం చేపట్టి ఏడాది పూర్తయినా ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. గత పీఆర్సీ బకాయిలతో పాటు డీఏ, సరెండర్ లీవ్, ఏపీజీఎల్‌ఐ బకాయిలు చెల్లింపులకు నోచుకోలేదన్నారు. ప్రభుత్వ పథకాలను నిరంతరం ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్యోగులను ప్రభుత్వం విస్మరించడం తగదన్నారు. ఉద్యోగులకు జీవన్మరణ సమస్యగా ఉన్న సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాధ్యక్షురాలు డి.సుజాత రాణి, ట్రెజరర్ కె.నరసింహారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి.రూతు ఆరోగ్య మేరి, నాయకులు డి.సుబ్బారావు, సూర్య కుమార్, హిఫాజతుల్లా, శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.