
కరుణ చూపని కూటమి
● అంత పెద్ద ప్రమాదం జరిగికూలీలు చనిపోయినా ప్రకటించని పరిహారం
● రెక్కాడితే కానీ డొక్కాడని యానాదుల కుటుంబాలను ఆదుకోని ప్రభుత్వం
సాక్షి, రాయచోటి: రెడ్డిపల్లి చెరువుకట్టపై సోమవారం రాత్రి లారీ బోల్తా పడి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో శెట్టిగుంట గిరిజన కాలనీకి చెందిన 9 మంది చనిపోగా.. చాలా మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. రెక్కాడితేగానీ డొక్కాడని కూలీలు మామిడి కాయల కోతకు వెళ్లి రోడ్డు ప్రమాదంలో చనిపోతే వారిని కూటమి ప్రభుత్వం ఆదుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంపై పలువురు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇన్‌చార్జ్ మంత్రి బిసి జనార్ధనరెడ్డి వచ్చి పరామర్శతో సరిపుచ్చారే తప్ప ప్రభుత్వం తరపున ఆర్థికసాయం ప్రకటించలేదు. రైల్వేకోడూరు కూటమి నాయకులు రూపానందరెడ్డి అరకొరగా ఖర్చుల నిమిత్తం ఇచ్చారే తప్ప ప్రభుత్వం నుంచి పరిహారాన్ని ఎవరూ ప్రకటించలేదు.
ప్రాణాలు పోయినా పట్టించుకోరా..?
ఒకేసారి ప్రమాద ఘటనలో 9 మంది కూలీలు చనిపోగా మరో 10 మందికి పైగా గాయపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో సర్కార్ ప్రమాదం జరిగిన ఒకరోజో, రెండ్రోజుల్లోపు బాధిత కుటుంబాలను ఆదుకునే దిశగా అడుగులు వేస్తాయి. అయితే ఘటన జరిగినా మూడు రోజులు దాటినా ఇప్పటి వరకు కూటమి సర్కార్ నుంచి పరిహారపు మాటేలేదు. అడవిలో దొరికే పదార్థాలతో పాటు కూ లి పనులకు వెళితే తప్ప జీవితం గడవని పేద కూలీలను పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుపతి జిల్లాలోని వెంకటగిరి, రేణిగుంటకు చెందిన వారు పనుల కోసం వలస వచ్చి మృత్యువాతపడటం అందరినీ కలిచివేసింది. గాయపడిన వారు కూడా రాజంపేట ఆసుపత్రి నుంచి అలాగే గాయాలకు కట్లుతోనే సోమవారమే వెళ్లిపోయారు. ప్రభుత్వం అత్యుత్తమ వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోకపోగా పరిహారపు మాట ఎత్తకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
ఎదురుచూపులు
శెట్టిగుంట గిరిజన కాలనీ ఇంకా ప్రమాద సంఘటన నుంచి కోలుకోలేదు. ఘటన జరిగి మూడు రోజులు అవుతున్నా ఎవరిని కదిపినా కన్నీటి పర్యంతం అవుతున్నారు. చనిపోయిన వారందరూ కాలనీలోని వారికి అంతా బంధువులే కావడంతో వారి బాధ వర్ణనాతీతం. ప్రభుత్వం నుంచి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. చనిపోయి న కుటుంబాలతో పాటు గాయపడ్డ వారికి కూటమి సర్కార్ వెంటనే ఆర్థికసాయం అందించాలని వైఎస్‌ఆర్‌సీపీ డిమాండ్ చేస్తోంది.