
ఆర్టీసీ బస్టాండులో ప్రయాణికుల ఆందోళన
కడప కోటిరెడ్డిసర్కిల్ : కడప నుంచి బెంగళూరుకు వెళ్లాల్సిన అమరావతి ఏసీ సర్వీసు మొరాయించడంతో ప్రయాణికులు ఆందోళన చేసిన ఘటన ఆదివారం మధ్యాహ్నం కడప బస్టాండులో జరిగింది. ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు కడప నుంచి బెంగళూరుకు వెళ్లాల్సిన అమరావతి ఏసీ బస్సు మొరాయించింది. ఈ క్రమంలో బస్టాండుకు చేరుకున్న ప్రయాణికులు ఎంతసేపటికీ బస్సు రాకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బస్టాండులోని కంట్రోలర్‌తో వాగ్వాదానికి దిగారు. మరోవైపు బస్సుకు మరమ్మతుల కోసం చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఆర్టీసీ అధికారులు చేసేది లేక సాయంత్రం 6 గంటలకు ఇంద్ర సర్వీసును బెంగళూరుకు పంపించారు. ఈ సందర్భంగా పలువురు ప్రయాణికులు మాట్లాడుతూ ఆర్టీసీ బస్సులను సకాలంలో పంపాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. బస్సు సకాలంలో రాకపోవడంతో వివిధ సమస్యలు ఎదుర్కొన్నామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని వారు కోరారు.
మూడు గంటలు ఆలస్యంగా
బెంగళూరు సర్వీసు