
ఈ యాప్‌పై ఓ లుక్ వేయాల్సిందే !
ఖాజీపేట : ప్రతి మనిషికి ఆశ ఉంటుంది.. తక్కువ పెట్టుబడి డబ్బుతో ఎక్కువ లాభం వస్తుందంటే మనిషి కనీస వివేకం కోల్పోతాడు. మనుషుల్లోని ఈ బలహీనతను ఆధారంగా చేసుకుని లుక్ యాప్ ద్వారా భారీ దోపిడీ చేసిన సంఘటన కొత్తగా వెలుగులోకి వచ్చింది. సైబర్ నేరాల పట్ల కేంద్ర ప్రభుత్వం ఎంతగా అవగాహన కల్పిస్తున్నా కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలు చేస్తూ అత్యాశపరులను సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టిస్తూనే ఉన్నారు. వివరాల్లోకి వెళితే..
లుక్ యాప్ ద్వారా ఒక సారి డిపాజిట్ చేస్తే ప్రతిరోజు ఆదాయం పొందవచ్చన్న కొత్త రకమైన ఆలోచన ద్వారా సైబర్ నేరగాళ్లు కొత్త రకమైన యాప్‌ను తయారు చేశారు. ఈ యాప్ గురించి వాట్సాప్ ద్వారా అలాగే వివిధ రకాల సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించారు. రోజు వారి ఆదాయం వారంలో డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చని అందరిని బురిడీ కొట్టించారు. ఇదికాక ఒకరు డిపాజిట్ చేసిన తరువాత మరో 10 మందిని డిపాజిట్ చేయిస్తే వారి కి ప్రమోషన్ ద్వారా అదనపు ఆదాయం వస్తుందని మోసానికి పాల్పడ్డారు. అలాగే డిపాజిట్ చేసిన వ్యక్తి అమైంట్‌ను బట్టి వారికి రోజు ఆదాయం వస్తుందని ఆశ చూపించారు. ఇందులో రూ.2వేల నుంచి రూ.70లక్షల వరకూ డిపాజిట్ చేసే ఏర్పాట్లు చేశారు. డిపాజిట్ మొత్తాన్ని బట్టి రోజు వారి ఆదాయం గురించి వివరించారు. రూ.2వేలు డిపాజిట్ చేస్తే ప్రతి రోజు రూ.150, రూ.70వేలకు రోజుకు రూ.2500 ఇలా వివిధ కేటగిరీలను బట్టి రెండేళ్లపాటు ఆదాయం వస్తుందని నమ్మించారు. అలాగే వారంలో ఒకసారి వచ్చిన మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించారు. మొదట్లో రెండు వారాలు అందరికి డబ్బులు బాగానే వేశారు. దీంతో నమ్మకం కలిగి చాలా మందిని ఈ లుక్ యాప్‌లోకి చేర్పించారు. సభ్యుల సంఖ్య వందల నుంచి వేలకు చేరింది.
25 నుంచి పని చేయని యాప్..
వందల సంఖ్య నుంచి వేల సంఖ్యలోకి చేరిన బాధితులు ఇలా లక్షల్లో యాప్‌లో డబ్బులు వేశారు. ఒక్క ఖాజీపేట మండలంలోనే 200 మంది బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కొక్కరు రూ.2వేల నుంచి సుమారు మూడు లక్షల రూపాయల వరకూ డిపాజిట్ చేసినట్లు సమాచారం. ఒక్క ఖాజీపేటలోనే రూ.20లక్షల నుంచి రూ.30 లక్షల డబ్బు డిపాజిట్ చేసి మోసపోయినట్లు తెలిసింది. జిల్లా వ్యాప్తంగా 2వేల మందికి పైగానే బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా మొత్తం చూస్తే సుమారు రూ.30 కోట్ల మేరకు డబ్బు డిపాజిట్ చేసి మోసపోయినట్లు అంచనా. పూర్తి స్థాయిలో విచారణ జరిగితే ఈ మొత్తం ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉంది. కడపలోని ఒక్క వాట్సాప్ గ్రూప్ యాప్‌లోనే రూ.3కోట్లు పోయినట్లు సమాచారం. ఇలాంటి గ్రూపులు జిల్లాలో చాలా ఉన్నాయని తెలుస్తోంది. అయితే గత నెల 25 నుంచి సాంకేతిక కారణాలతో యాప్‌ను పూర్తిగా రద్దు చేసినట్లు బాధితులు వాపోతున్నారు. డిపాజిట్ సొమ్ముకు రోజువారి డబ్బు విత్‌డ్రా లేకపోవడం, యాప్ పనిచేయక పోవడంతో మోసపోయినట్లు బాధితులు గుర్తించారు.
తెర వెనుక ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు..
ఖాజీపేట మండలంలో ఈ యాప్ ద్వారా రోజువారి ఆదాయం వస్తుందని ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రచారం చేసినట్లు తెలుస్తోంది. అతని ద్వారా చాలా మంది అతని మాటలు నమ్మి ఈ యాప్‌లో డబ్బులు డిపాజిట్ చేసి మోసపోయినట్లు తెలిసింది. జిల్లా వ్యాప్తంగా ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఈ యాప్‌లోని డిపాజిట్ల బాగోతాన్ని ప్రచారం చేసి అందులో సభ్యులుగా అందరిని చేర్పించినట్లు బాధితులు చెబుతున్నారు. యాప్‌లో సభ్యులుగా చేర్చిన వారిని డబ్బుల విషయం గురించి అడిగితే తమకేం సంబంధం లేదన్నట్లు చెబుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫిర్యాదులకు సిద్ధం..
లుక్ యాప్ బాధితులకు ప్రత్యేక వాట్సాప్ గ్రూపు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో బాధితులంతా యాప్ ద్వారా మోసపోయిన తీరుపై చర్చించుకుంటున్నారు. అయితే ఈ యాప్‌లో అధికంగా 80 శాతం మహిళలు బాధితులుగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ఉద్యోగుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. అయితే చాలా మంది ఈ యాప్ వల్ల బాధితులం అని తెలిస్తే ఎక్కడ పరువు పోతుందో అని కేసు పెట్టేందుకు ముందుకు రావడం లేదు. మరికొందరు మా ఖర్మ కొద్ది డబ్బులు పోగొట్టుకున్నాం ఎవ్వరికై నా తెలిస్తే పరువు పోతుంది ఎందుకులే అని వదిలేస్తున్నారు. ఇంకొందరు ఇప్పటికే సైబర్ పోలీసులకు నేరుగా, మరికొందరు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. లుక్ యాప్ మోసగాళ్లకు శిక్షపడేలా అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
లుక్ యాప్ పేరుతో భారీ దోపిడీ
ఒకసారి డిపాజిట్ చేస్తే
రోజూ డబ్బులు ఇస్తామని మోసం
వెలుగులోకి వచ్చిన కొత్తరకం మోసం
జిల్లా వ్యాప్తంగా 2వేల మంది బాధితులు
రూ.30 కోట్లు దోపిడీ చేసినట్లు
సమాచారం