
అంతులేని దోపిడీ.. అరికట్టేవారేరీ!
కడప ఎడ్యుకేషన్: జిల్లాలో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలో విద్యా వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ఒకవైపు అధిక ఫీజుల వసూళ్లు, మరోవైపు విద్యాసామగ్రి అమ్మకాల పేరుతో దోపిడీ పర్వం యమ దర్జాగా సాగుతోంది. దీంతో పేద, మద్య తరగతి తల్లిదండ్రులకు దిమ్మతిరుగుతోంది. దీనికితోడు కొన్ని కార్పొరేట్ సంస్థల యాజమాన్యాలు సొంత సిలబస్ పేరుతో పుస్తకాలు ముద్రించి విద్యార్థులకు బలవంతంగా అంటగడుతున్నారు. ప్రభుత్వం ముద్రించిన పుస్తకాల ధరలు వందల్లో ఉంటే ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు ముద్రించిన పుస్తకాల ధరలు మాత్రం వేలల్లో ఉంటున్నాయి. ఇదేమని అడిగేవారే కరువయ్యాయని తల్లిదండ్రుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మా పుస్తకాలే కొనాలి..
కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ సూళ్ల యాజమాన్యాలు తాము ముద్రించిన తమ సిలబస్ పుస్తకాలను మాత్రమే కొనుగోలు చేయాలని ఆర్డర్ వేస్తున్నారు. ఇందులో 1 నుంచి 5వ తరగతి వరకు 5000 నుంచి 6500 వరకు, 6 నుంచి 10వ తరగతి వరకు 6 వేల నుంచి 10 వేలు పైనా వసూలు చేస్తున్నట్లు పలువురు తల్లిదండ్రులు తెలిపారు. ఇక ఇంటర్మీడియట్‌కై తే మరింత ఎక్కువ ఉంటుందని వాపోతున్నారు. దీంతోపాటు నీట్, ఐఐటీ, ఒలంపియాడ్, సీ బ్యాచ్, టెక్నో వంటి పలు రకాల పేర్లతో అదనంగా వసూళ్లు చేస్తున్నారు. ఇదంతా ఆర్థిక భారమైనా.. గత్యంతరం లేక వారు అడిగినంత చెల్లించాల్సి వస్తుందని పలువురు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయా ప్రైవేటు, కార్పోరేట్ విద్యాసంస్థల బ్రాంచు పుస్తకాలు, యూనిఫాం ఇతర సామగ్రితో వ్యాపార కేంద్రాలుగా దర్శనమిస్తున్నాయి.
అరికట్టేవారే కరువు
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యాసామగ్రిని తమ పాఠశాలల్లోనే దుకాణాలను ఏర్పాటు చేసి విక్రయాలు సాగిస్తున్న విషయం విద్యాశాఖ అధికారులకు తెలిసినా అరికట్టడంలో విఫలమవుతున్నారని విద్యార్థులు తల్లిదండ్రుల ఆరోపిస్తున్నారు. కొంతమంది తల్లిదండ్రులు స్వయంగా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనికి తోడు విద్యార్థి సంఘాలు కూడా పాఠశాలల వద్ద, డీఈఓ కార్యాలయం, ఆర్‌ఐవో కార్యాలయం వద్ద పాఠశాలల్లో పుస్తకాల విక్రయాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నా స్పందించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
గుర్తింపు రద్దు చేయాలి
చాలా ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లోనే పుస్తకాలు, విద్యాసామాగ్రి అమ్మకాలు చేస్తున్నా పాఠశాలలలపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోలేదు. ఈ విషయంలో అధికారుల ధోరణి సరికాదు. నిబంధనలు పాటించకుండా అమ్మకాలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి. – జయవర్థన్,
అఖిల భారత విద్యార్థి బ్లాక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
కళాశాలల్లో కూడా...
జిల్లాలో కార్పొరేట్, ప్రై వేటు కళాశాలల్లో కూడా ఫీజుల దొపిడీ సాగుతోంది. ఈ విషయమై విద్యాశాఖ అధికారుల కు పిర్యాదు చేసిన స్పందన లేదు.
– అంకన్న, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
అధిక ఫీజుల విషయంలో...
జిల్లాలో ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు, కళాశాలలు పలు రకాల ఫీజుల పేరుతో తల్లితండ్రుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ విషయంలో ప్రైవేటు, కార్పోరేటు యాజమాన్యలు ఎలాంటి నిబంధనలు పాటించడం లేదు. – సుబ్బరాయుడు,
ప్రగతిశీల విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి
విద్యాలయాలా...వ్యాపార కేంద్రాలా?
ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో యథేచ్ఛగా పుస్తక విక్రయాలు
అధిక ధరలకు పుస్తకాలు,యూనిఫాం, ఇతర సామగ్రి
నిద్దురపోతున్న విద్యాశాఖ అధికారలు

అంతులేని దోపిడీ.. అరికట్టేవారేరీ!

అంతులేని దోపిడీ.. అరికట్టేవారేరీ!

అంతులేని దోపిడీ.. అరికట్టేవారేరీ!