బస్టాండా.. స్టాక్ పాయింటా.!
కమలాపురం ఆర్టీసీ బస్టాండులో సీసీ రోడ్డు నిర్మాణ సామగ్రి
ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు
సాక్షి టాస్క్‌ఫోర్స్ : కమలాపురం నగర పంచాయితీ పరిధిలోని ఆర్టీసి బస్టాండులో సీసీ రోడ్డు నిర్మాణ సామగ్రి నిల్వ చేస్తున్నారు. కమలాపురం పట్టణంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో కోటి రూపాయలకు పైగా నిధులు వెచ్చించి నూతన హంగులతో ఆర్టీసీ బస్టాండు నిర్మించారు. మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, అప్పటి ఆర్టీసీ ఛైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జున రెడ్డిలు ప్రత్యేక చొరవ చూపి ప్రజల అభీష్టం మేరకు నూతనంగా ఆర్టీసీ బస్టాండును నిర్మించారు.
అయితే ఇటీవల కూటమి ప్రభుత్వం కమలాపురం పట్టణంలోని పడమట వీధి, కోగటం రోడ్డు లకు సీసీ రోడ్డు నిర్మాణం చేసేందుకు నిధులు విడుదల చేసింది. టెండర్లు పూర్తి చేసి సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ సీసీ రోడ్లకు అవసరమైన కంకర తదితర సామగ్రిని కాంట్రాక్టర్ ఆర్టీసి బస్టాండు ఆవరణంలోనే నిల్వ చేస్తున్నారు.
ఆర్టీసీ బస్సుల బరువు కంటే కంకర తరలించే టిప్పర్ల బరువు ఎక్కువ ఉండటంతో బస్టాండులో ఏర్పాటు చేసిన సీసీ రోడ్డు పూర్తిగా ధ్వంసం అయ్యే అవకాశం ఉంది. అలాగే బస్టాండులో దుమ్ము, ధూళి నిండుకుని ప్రయాణికులు కూర్చునే అవకాశం కూడా ఉండదని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోటి రూపాయలకు పైగా నిధులు వెచ్చించి నిర్మించిన బస్టాండు ఛిద్రమవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ అధికారులు స్పందించి బస్టాండులో సీసీ రోడ్డు నిర్మాణ సామగ్రి నిల్వ చేయకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


