అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని వైఎంఆర్ కాలనీలో ఉన్న సాయికుటీర్ రోడ్డులో మార్తల ఓబుళరెడ్డి అలియాస్ గిరి (47) అనే వ్యక్తి తన ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. త్రీ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఓబుళరెడ్డి కాంట్రాక్టర్‌గా పని చేసేవాడు. అతనికి 2005లో వివాహమైంది. ఒక కుమార్తె కూడా ఉంది. అతను మద్యానికి బానిసయ్యాడనే కారణతో ఏడేళ్ల క్రితం భార్య విడాకులిచ్చింది. నాటి నుంచి తల్లి సరస్వతితో కలిసి ఇంట్లో ఉంటున్నాడు. తల్లికి క్యాన్సర్ వ్యాధి ఉండటంతో చికిత్స కోసం వారం రోజుల క్రితం కర్నూలు ఆస్పత్రిలో చేర్పించారు. ఓబుళరెడ్డి మృతదేహం పక్కనే మద్యం సీసాలు ఉన్నాయి. మద్యం మత్తులో ఉన్న అతను మంచంపై నుంచి కింద పడి ఎండ తాపానికి తట్టుకోలేక మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. శనివారం రాత్రి ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. త్రీ టౌన్ సీఐ గోవిందరెడ్డి, ఎస్‌ఐ వెంకటరెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ఓబుళరెడ్డి మృతి చెందిన విషయాన్ని హైదరాబాద్‌లో ఉంటున్న సోదరికి పోలీసులు సమాచారం అందించారు. నాలుగు రోజుల క్రితం అతను మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదును తీసుకున్న అనంతరం ఆదివారం ఘటనా స్థలంలోనే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు సీఐ తెలిపారు.
నాలుగు రోజుల క్రితం చనిపోయినట్లు
భావిస్తున్న పోలీసులు


