
ఈతకు వెళ్లి ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
పులివెందుల రూరల్ : పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని పెద్దరంగాపురం గ్రామానికి చెందిన నాదెండ్ల చిన్న ఇమాములు, మస్తానమ్మ దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు నాదెండ్ల అన్వర్ (20) గురువారం ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నాదెండ్ల అన్వర్ చిత్తూరు జిల్లాలోని పుత్తూరులో ఇంజినీరింగ్ కళాశాలలో సెకండియర్ చదువుతున్నాడు. సెలవులు కావడంతో సరదాగా స్నేహితులతో కలిసి పులివెందుల మండల పరిధిలోని రాయలాపురం గ్రామ సమీపంలో ఉన్న బ్రిడ్జి వద్ద ఉన్న కుంట వద్దకు ఈతకు వెళ్లాడు. అక్కడ అన్వర్ ఈత కొడుతూ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రులు, బంధువులు 20 ఏళ్లకే నూరేళ్లు నిండాయా అంటూ అన్వర్ మృతదేహం వద్ద బోరున విలపించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.