రాయచోటి : రాజంపేట మాజీ ఎంపీ, రాయచోటి మాజీ ఎమ్మెల్యే, రాజకీయ దిగ్గజం సుగవాసి పాలకొండ్రాయుడు పార్థివదేహానికి ప్రభుత్వం తరపున అధికారిక లాంఛనాలతో గురువారం అంత్యక్రియలు నిర్వహించారు. తండ్రిని కడసారి చూసి కుమార్తె, కుమారులు, అభిమానులు కన్నీరుమున్నీరుగా విలపించడం అక్కడున్న ప్రతి ఒక్కరినీ కదిలించింది. వేలాదిగా తరలివచ్చిన జనం 40 ఏళ్ల రాజకీయ జీవితాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు. రాయచోటి పెద్దాయనగా పిలుచుకునే పాలకొండ్రాయుడును కడసారిగా చూసేందుకు నియోజకవర్గంలోని ప్రజలతో పాటు అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, వైఎస్‌ఆర్, అనంతపురం జిల్లాల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు.
అంతిమయాత్ర
వేలాదిగా తరలివచ్చిన ప్రజానీకపు అశ్రునయనాల మధ్య సీనియర్ రాజకీయ నేత మాజీ, ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్రాయుడు అంతిమయాత్ర సాగింది. గాలివీడు మార్గంలోని ఆయన స్వగృహం (ప్రీతమ్ రెసిడెన్సీ) నుంచి గురువారం ఉదయం 9.30 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమైంది. కదిరి రోడ్డు, హరినాథవీధి, ఆర్టీసీ బస్టాండ్, నేతాజీ సర్కిల్, ఠానా, బండ్లపెంట, మాసాపేట, మునెప్పగారిపల్లె, పాతరాయచోటి మీదుగా గాలివీడు మార్గంలోని ప్రసాద్ థియేటర్ వరకు సాగింది. అంతిమయాత్రలో అభిమానులు, కార్యకర్తలు జోహార్ రాయుడు అంటూ నినాదాలు చేస్తూ భాగస్వాములయ్యారు. వారి మధ్యన పెద్దాయన పార్థివదేహంతో ప్రత్యేక వాహనం కదిలింది. ప్రత్యేక వాహనంలో ఆయన ఇద్దరు కుమారులు సుబ్రమణ్యం, ప్రసాద్‌బాబులు ఇరువైపులా నిల్చున్నారు.
అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారాలు
వేలాదిగా తరలివచ్చిన అభిమానులు,
నాయకులు, కార్యకర్తలు
సుగవాసికి కన్నీటి వీడ్కోలు