లింగాల : లింగాల మండలం పార్నపల్లె గ్రామంలో శనివారం రాత్రి భారీ ఈదురు గాలులు, వర్షానికి తీవ్రంగా దెబ్బతిన్న అరటి తోటలను సోమవారం రాష్ట్ర మంత్రి సవిత పరిశీలించారు. అనంతపురం జిల్లా యల్లనూరు మండలం నేర్జాంపల్లె గ్రామంలో పర్యటించి అక్కడ తీవ్రంగా దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించి రైతులతో చర్చించారు. అనంతరం పార్నపల్లె గ్రామంలో దెబ్బతిన్న అరటి పంటలను, తమలపాకు తోటలను పరిశీలించారు. తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఆమె రైతులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆర్కేవ్యాలీ క్యాంపస్‌లో పోటాపోటీగా క్రికెట్ పోటీలు
వేంపల్లె : ఆర్జీయూకేటీ పరిధిలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో పోటాపోటీగా క్రికెట్ పోటీలు జరిగాయి. సోమవారం ఆర్కేవ్యాలీ క్యాంపస్‌లోని ఆట స్థలంలో స్పోర్ట్స్ మీట్ క్రీడా పోటీలు నిర్వహించారు. దీంతో టీచింగ్, నాన్ టీచింగ్ మధ్య జరిగిన క్రికెట్ పోటీల్లో టెక్నికల్ టైగర్స్ జుట్టు విజయం సాధించింది. మొదట టాస్ గెలిచిన ఆర్‌కేవీ రైడర్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 10 ఓవర్లలో 78 పరుగులు చేయగా.. బ్యాటింగ్‌కు దిగిన టెక్నికల్ టైగర్స్ జుట్టు ఒక ఓవర్ మిగిలి ఉండగానే 79 పరుగులు చేసి విజయం సాధించింది. క్రీడా పోటీలలో గెలుపొందిన జట్టు సభ్యులను డైరెక్టర్ కుమార స్వామి గుప్తా, పరిపాలన అధికారి డాక్టర్ రవికుమార్ అభినందించారు. అలాగే గెలుపొందిన జట్టు సభ్యులకు బహుమతులు అందజేశారు.
మత్తుపదార్థాలు సేవించే వారిపై డ్రోన్ కెమెరాలతో నిఘా
కడప అర్బన్ : గంజాయి, అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నారు. జిల్లా ఎస్.పి. ఈ.జి. అశోక్ కుమార్ ఆదేశాల మేరకు కడప నగరం, శివారులో గంజాయి తీసుకోవడం, అసాంఘిక కార్యకలాపాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో పోలీస్ అధికారులు, సిబ్బంది అత్యాధునిక డ్రోన్ కెమెరాల సాయంతో నిఘా ఉంచేలా చర్యలు చేపట్టారు. ఆయా ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. అనుమానాస్పదంగా సంచరించే వారిపై నిఘా ఉంచడంతో పాటు గంజాయిని సేవించే వారిని గుర్తించేందుకు విస్తత చర్యలు చేపట్టారు. సోమవారం నగరంలోని నకాష్, సాయిపేట, ఉక్కాయపల్లి, మార్కెట్‌యార్డ్, పాత కడప, మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న స్మశాన వాటిక, పరిసర ప్రాంతాలు, బుగ్గవంక పరివాహక ప్రాంతాలలో డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచారు. అనుమానాస్పద వ్యక్తులను క్షుణ్ణంగా విచారిస్తున్నారు. ఫ్యాక్షన్ జోన్ ఇన్‌స్పెక్టర్ రమణారెడ్డి, స్పెషల్ పార్టీ సిబ్బంది, డ్రోన్ ఆపరేటర్ పాల్గొన్నారు.
అరటి తోటలను పరిశీలించిన మంత్రి సవిత
అరటి తోటలను పరిశీలించిన మంత్రి సవిత