సమస్యలకు పరిష్కారమేదీ ? | - | Sakshi
Sakshi News home page

సమస్యలకు పరిష్కారమేదీ ?

Mar 25 2025 1:32 AM | Updated on Mar 25 2025 1:30 AM

కడప సెవెన్‌రోడ్స్‌ : కలెక్టరేట్‌తోపాటు మండల తహసీల్దార్‌ కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)కు ప్రజల నుంచి కుప్పలు తెప్పలుగా అర్జీలు వస్తున్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు జిల్లాలో 36,468 ఫిర్యాదులు అందాయి. ఈ ఒక్కరోజులోనే కలెక్టరేట్‌కు 221 ఫిర్యాదులు వచ్చాయి. కానీ సమస్యల పరిష్కారం కాగితాలకే పరిమితమైంది. క్షేత్ర స్థాయిలో ఏదో చిన్నపాటి సమస్యలు మినహా ఎక్కువ భాగం అపరిష్కృతంగానే ఉన్నాయి. అర్జీదారునికి ఎండార్స్‌మెంట్‌ జారీ చేసి సమస్యను పరిష్కరించామంటూ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. జిల్లాలో గుర్తించిన టాప్‌–10 ప్రభుత్వశాఖలకు సంబంధించి వస్తున్న అర్జీలను పరిశీలిస్తే ఎక్కువ భాగం రెవెన్యూ, సర్వే విభాగాలకు సంబంఽధించిన సమస్యలే ఉన్నాయి. ఆ తర్వాత పంచాయతీరాజ్‌, పౌరసరఫరాలు, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌, గృహ నిర్మాణం, పాఠశాల విద్యశాఖలకు సంబంధించిన ఫిర్యాదులు అధిక సంఖ్యలో వస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, పనితీరు కారణంగా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో వచ్చిన వాళ్లే మళ్లీమళ్లీ గ్రీవెన్స్‌సెల్‌కు వచ్చి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. సోమవారం వచ్చిన అర్జీలలో మచ్చుకు కొన్నింటి వివరాలు ఇలా ఉన్నాయి.

దారి లేక ఇక్కట్లు

దళితులమైన మాకు స్మశానానికి వెళ్లే దారి లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. మృతదేహాన్ని తీసుకు వెళ్లాలంటే మోకాళ్లలోతు దిగుబడే పంట పొలాల్లో నుంచి స్మశానానికి వెళ్లాల్సి వస్తోంది. ఊరికి 2 కిలోమీటర్ల దూరంలోని స్మశానానికి పంట పొలాలను దాటుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఈ విషయాన్ని తహసీల్దార్‌, ఆర్డీఓ, డీఆర్వోల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ప్రయోజనం కనిపించలేదు. కొంతమంది స్మశాన స్థలాన్ని కబ్జా చేసేందుకు వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేసే ప్రయత్నాలు సాగిస్తున్నారు. మాకు దారి కల్పించడంతోపాటు చుట్టూ ప్రహారీ, షెల్టరు నిర్మించి బోరు వేయాలని కోరుతున్నాం.

– లెనిన్‌ ప్రసాద్‌, తుమ్మలూరు, పెండ్లిమర్రి మండలం

పెన్షన్‌ నిలిపివేశారు

వేలిముద్రలు, ఐరిస్‌ నమోదు కాలేదని నాకు పెన్షన్‌ నిలిపివేశారు. ఎన్టీ రామారావు హయాం నుంచి పెన్షన్‌ పొందుతున్నాను. ప్రస్తుతం నా వయస్సు 92 సంవత్సరాలు. ఈ విషయాన్ని పలుమార్లు మండల, గ్రామ స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో కుటుంబ సభ్యుల ఆసరాతో కలెక్టర్‌కు చెప్పుకుంటే పెన్షన్‌ దక్కుతుందనే ఆశతో వచ్చాను. నా గోడు ఆలకించి పెన్షన్‌ మంజూరు చేసి ఆదుకోవాలని కోరుతున్నాను. – మద్దిక రంగమ్మ,

దత్తాపురం, కొండాపురం మండలం

నా భూమిని ఇతరుల పేరిట ఆన్‌లైన్‌ చేశారు

మా పెద్దవాళ్ల నుంచి గ్రామ సర్వే నెంబరు 118/1, 118/3లో 7.56 ఎకరాల భూమి వారసత్వంగా సంక్రమించింది. మా నాయనమ్మ ఆ భూమిని 1950 జూన్‌ 23న మల్లెపల్లె వెంకట సుబ్బమ్మ వద్ద కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఆ భూమిని మేము ఎవరికీ విక్రయించలేదు. ఆ భూమిపై మాకు ఉన్న హక్కులను తెలియజేసే ఒరిజినల్‌ దస్తావేజులు, ఆర్‌హెచ్‌ నకలు, ఈసీలు, 1బీ, అడంగల్‌, పాసు పుస్తకాలు, పన్ను రశీదులు వంటి అన్ని ఆధారాలు మా వద్ద ఉన్నాయి. అయితే అందులో 68 సెంట్ల భూమిని గ్రామ సచివాలయ సర్వేయర్‌, వీఆర్వో కలిసి చల్లా రమాదేవి పేరిట ఆన్‌లైన్‌ చేశారు. హక్కుదారులమైన మా పేరిట ఆన్‌లైన్‌ చేయాలని తహసీల్దార్‌ను కోరాం. ఆయన స్పందించకపోవడంతో ఇక్కడికి వచ్చాం.

– వేమిరెడ్డి సురేష్‌రెడ్డి, లేటపల్లె, కమలాపురం మండలం

కార్యాలయాల చుట్టూ

కాళ్లరిగేలా తిరుగుతున్న ప్రజలు

కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్న అర్జీలు

పరిష్కారంలో అధికారుల కాకిలెక్కలు

అర్జీదారులకు తప్పని అగచాట్లు

సమస్యలకు పరిష్కారమేదీ ?1
1/3

సమస్యలకు పరిష్కారమేదీ ?

సమస్యలకు పరిష్కారమేదీ ?2
2/3

సమస్యలకు పరిష్కారమేదీ ?

సమస్యలకు పరిష్కారమేదీ ?3
3/3

సమస్యలకు పరిష్కారమేదీ ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement