వేంపల్లె : వేంపల్లి మండలం కుమ్మరాంపల్లె సమీపంలోని ఓ ఇంట్లో గురువారం గుర్తు తెలియని వ్యక్తులు రూ.7.5 లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు దోచుకెళ్లారు. పోలీసులు, బాధితుడి వివరాల మేరకు.. గ్రామ మాజీ సర్పంచ్ రామాంజనేయరెడ్డి సోదరుడు మధుసూదన్‌రెడ్డి, ఆయన సతీమణి మౌనిక వేంపల్లె–పులివెందుల రోడ్డులో దుస్తుల దుకాణం నిర్వహిస్తున్నారు. రోజూ ఉదయం ఎనిమిది గంటలకు వేంపల్లెలో దుకాణానికి వచ్చి.. రాత్రి తిరిగి ఇంటికి వెళ్తారు. పిల్లలు కూడా వేంపల్లె పాఠశాలలోనే చదువుతున్నారు. గురువారం యథా ప్రకారం దుకాణానికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చారు. ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడంతో వెళ్లి చూడగా బీరువా తెరచి దుస్తులు చిందరవందరగా ఉండడం గమనించారు. రూ.7.50 లక్షల విలువచేసే 65 గ్రాముల బంగారం, 1.5 కిలోల వెండి ఆభరణాల చోరీ జరిగినట్లు గుర్తించి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ప్రధాన తలుపును పగలగొట్టి ఇంటి వెనకవైపు నుండి పారిపోయి ఉంటారని బాధితుడు తెలిపారు. పోలీసులు క్లూస్ టీంతో వచ్చి తనిఖీలు నిర్వహించారు. వేలి ముద్రలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు వేంపల్లె సీఐ సురేష్‌రెడ్డి తెలిపారు.
బాధితుడి ఫిర్యాదుతో క్లూస్ టీం తనిఖీలు