కమలాపురం : కమలాపురం మండలం ఎర్రబల్లె, కొత్తపల్లె ఎస్సీ కాలనీకి చెందిన దళితులకు ప్రభుత్వం పంపిణీ చేసిన స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ కమలాపురం ఏరియా కార్యదర్శి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన ఆక్రమణకు గురైన స్థలాన్ని లబ్ధిదారులతో కలసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1994లో అప్పటి ప్రభుత్వం సర్వే నెంబర్ 100/726 లో ఎర్రబల్లె కొత్తపల్లె ఎస్సీ కాలనీ వాసులకు 2.30 ఎకరాలు కేటాయించిందన్నారు. అందులో ఒక ఎకరాలో 30 మందికి ప్లాట్లు వేసి డీకేటీ పట్టాలు పంపిణీ చేసిందన్నారు. మిగిలిన 1.30 ఎకరాలు కమ్యూనిటీ అవసరాల కోసం అలాగే వదిలేశారన్నారు. ఆ స్థలాన్ని గ్రామానికి చెందిన ప్రతాప్‌రెడ్డి, ఓబుల్‌రెడ్డిలు ఆక్రమించుకున్నారని ఆయన ఆరోపించారు. రెవెన్యూ అధికారులు స్పందించి ఆక్రమణకు గురైన భూమిని గుర్తించి ఎస్సీలకు అప్పగించాలని, అలాగే ఆక్రమణ దారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.