సర్పంచులపై కూటమి కక్ష | - | Sakshi
Sakshi News home page

సర్పంచులపై కూటమి కక్ష

Mar 16 2025 1:55 AM | Updated on Mar 16 2025 1:53 AM

కడప సెవెన్‌రోడ్స్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సర్పంచులపై అధికార ఎన్డీయే కూటమి ప్రజాప్రతినిధుల కక్ష సాధింపు చర్యలు రోజురోజుకు అధికమవుతున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని సర్పంచుల చెక్‌పవర్‌ రద్దు చేయించడం ద్వారా వేధింపులకు పాల్పడుతున్నారు. అధికారులు కూడా టీడీపీ నేతల ప్రాపకం కోసం చెప్పిన దానికంతా తలాడిస్తున్నారు. జిల్లా పంచాయతీ అఽధికారి రాజ్యలక్ష్మి అనుసరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారింది. దీంతో చేసేదిలేక బాధిత సర్పంచులు న్యాయ స్థానాలను ఆశ్రయించాల్సి వస్తోంది.

● ఖాజీపేట మండలం రావులపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్‌ పి.శివరామిరెడ్డి చెక్‌ పవర్‌ను రద్దు చేస్తూ జిల్లా పంచాయతీ అధికారి రాజ్యలక్ష్మి ఈనెల 10వ తేది ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ పంచాయతీ సాధారణ నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధులను దుర్వినియోగం చేశారని సర్పంచ్‌పై అధికార పార్టీకి చెందిన కొందరు అభియోగాలు మోపారు. ఫిర్యాదులు వచ్చిందే తడువుగా స్పందించిన డీపీఓ రాజ్యలక్ష్మి విచారణ జరిపి తనకు నివేదిక సమర్పించాలంటూ కడప డివిజనల్‌ పంచాయతీ అధికారిని ఆదేశించారు. 2022–23, 2023–24 సంవత్సరాలకు సంబంధించిన గ్రామ పంచాయతీ సాధారణ నిధులు రూ. 1,78,924, 2023–24లో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ. 46,652 కలిపి మొత్తం రూ. 2,25,576 నిబంధనలు పాటించకుండా వివిధ పనుల కోసం గ్రామ పంచాయతీ ఖర్చు చేసిందంటూ విచారణ అధికారి తన నివేదికలో పేర్కొన్నారు. నిబంధనలు పాటించలేదని చెప్పారే తప్ప, ఆ నిధులు దుర్వినియోగం చేసినట్లు నివేదికలో ఎక్కడా చెప్పలేదు. పనులకు చెల్లించిన నిధుల వివరాలు ఎం.బుక్కులో నమోదు చేశారుగానీ అంచనా వివరాలు లేవని విచారణ అధికారి తన నివేదికలో చెప్పడం సరికాదని పలువురు అంటున్నారు. ఎందుకంటే పనులకు సంబంధించిన అంచనా పత్రాలు రికార్డు కస్టోడియన్‌ అయిన పంచాయతీ కార్యదర్శి ఆధీనంలో ఉంటాయి. ఇక కోవిడ్‌ సమయంలో పారిశుద్ధ్యం, ప్రజారోగ్య పరిరక్షణ కోసం ఎక్కువ ఖర్చు చేయక తప్పలేదని సర్పంచ్‌ శివరామిరెడ్డి అంటున్నారు. వీఎల్‌సీ సరఫరా చేసిన ప్రతి వస్తువుకు సంబంధించిన బిల్లులను సర్పంచ్‌ విచారణ అధికారికి సమర్పించారు. కొనుగోలు చేసిన ప్రతి దాన్ని స్టాకు రిజిష్టర్‌లో నమోదు చేసి నిర్వహించే బాధ్యత ప్రభుత్వ నిబంధనల మేరకు పంచాయతీ కార్యదర్శిపై ఉంటుందేగానీ సర్పంచుపై కాదు. పంచాయతీ కార్యదర్శి/విస్తరణ అధికారి ఖర్చులకు సంబంధించిన బిల్లులను ప్రవేశ పెడితేనే పంచాయతీ ఆమోదిస్తుంది. నిజానికి పంచాయతీ విస్తరణ అధికారి తన పరిధిలోని పంచాయతీలను ప్రతినెలా సందర్శించి జమా ఖర్చులను తనిఖీ చేయాలి. పంచాయతీ పాలనలో ఏవైనా లోపాలుంటే సర్పంచుకు, సిబ్బందికి తగు సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇప్పటివరకు తనిఖీలు నిర్వహించి లోపాలు లేకుండా చూసేందుకు ఏ అధికారి రావులపల్లె పంచాయతీ సందర్శించలేదని తెలుస్తోంది. సర్పంచ్‌ అన్ని వివరాలను డీపీఓకు సమర్పించినప్పటికీ వాటిని పట్టించుకోకుండా టీడీపీ నేతల ఒత్తిళ్లకు లొంగి చెక్‌పవర్‌ రద్దు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

● గతంలో వీరపునాయునిపల్లె మండలం బుసిరెడ్డిపల్లె పంచాయతీ సర్పంచ్‌ లింగారెడ్డి అనూరాధ చెక్‌ పవర్‌ రద్దుకు చర్యలు చేపట్టారు. సర్పంచ్‌ అనూరాధ బుసిరెడ్డిపల్లె నుంచి గంగనపల్లె రూ. 1.14 లక్షలతో గ్రావెల్‌రోడ్డు నిర్మించారు. ఏఈ సర్టిఫికెట్‌ కూడా ఇచ్చారు. బిల్లు అప్పటికి ఇంకా తీసుకోలేదు. కాగా రోడ్డు పనుల్లో అవినీతి జరిగిదంటూ టీడీపీ నాయకులు ఫిర్యాదు చేయడంతో డీపీఓ రాజ్యలక్ష్మి పులివెందుల డివిజనల్‌ పంచాయతీ అధికారిని విచారణకు నియమించారు. దీనిపై సర్పంచ్‌ గతనెల 19వ తేదిన జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇలా అధికార పార్టీ నేతల ఫిర్యాదులకు విలువనిస్తూ వైఎస్సార్‌ సీపీకి చెందిన సర్పంచులను డీపీఓ వేధిస్తుండడం వివాదాస్పదంగా మారింది.

ముక్తసరి జవాబుతో సరిపెట్టిన డీపీఓ

చెక్‌ పవర్‌ రద్దుతో వేధింపులు

నేతల కనుసన్నల్లో అధికారులు

న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్న బాఽధితులు

ఖాజీపేట మండలం రావుపల్లె గ్రామ సర్పంచ్‌ శివరామిరెడ్డి చెక్‌ పవర్‌ రద్దు వెనుక మీపై ఉన్న రాజకీయ ఒత్తిళ్లే కారణమని తెలుస్తోంది. ఇందుకు మీ సమాధానం ఏమిటని శనివారం డీపీఓ రాజ్యలక్ష్మిని ‘సాక్షి’ వివరణ కోరింది. ఇందుకు ఆమె బదులిస్తూ తనపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని, కడప డీఎల్‌పీఓ సమర్పించిన విచారణ నివేదిక ఆధారంగానే తాను చెక్‌ పవర్‌రద్దు చేశానని చెప్పారు. డీఎల్‌పీఓ నివేదికలో నిబంధనలు పాటించలేదని మాత్రమే ఉంది తప్ప నిధుల దుర్వినియోగం అనే మాట ఎక్కడా లేదని ప్రశ్నించగా ఆమె నీళ్లు నమిలారు. తాను వేరే సమావేశంలో ఉన్నానంటూ ఫోన్‌ కట్‌ చేయడం గమనార్హం.

సర్పంచులపై కూటమి కక్ష 1
1/2

సర్పంచులపై కూటమి కక్ష

సర్పంచులపై కూటమి కక్ష 2
2/2

సర్పంచులపై కూటమి కక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement