
కాశినాయన భవనాలు ప్రభుత్వమే పునర్నిర్మించాలి
కాశినాయన : జ్యోతి క్షేత్రంలో అటవీ అధికారులు కూల్చివేసిన కాశినాయన ఆశ్రమ కట్టడాలను ప్రభుత్వమే పునర్నిర్మించాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాంభూపాల్, జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, కార్యవర్గ సభ్యులు అన్వేష్, జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్సార్ జిల్లా కాశినాయన ఆశ్రమంలో అటవీ అధికారులు కూల్చివేసిన కట్టడాలను శుక్రవారం వారు పరిశీలించి ఆశ్రమ నిర్వాహకులతో చర్చించారు. అనంతరం మాట్లాడుతూ కరవు ప్రాంత రైతుల సహకారంతో మూడు దశాబ్దాలుగా నిర్వహిస్తున్న అన్నదాన ఆశ్రమంలోని కట్టడాలను అటవీశాఖ అనుమతులు లేవంటూ కూల్చివేయడం తగదన్నారు. కూటమి ప్రభుత్వం గత డిసెంబర్‌లో ఇచ్చిన ఆదేశాలతోనే నిర్మాణాలను కూల్చివేశారని ఆశ్రమ నిర్వాహకులు చెప్పారన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులతో కూల్చిన కట్టడాలను మంత్రి లోకేష్ తన సొంత డబ్బులతో నిర్మిస్తున్నట్లు ప్రచారం చేసుకోవడం సబబు కాదన్నారు. గత 12 ఏళ్లుగా నిలిపివేసిన ఆలయ నిర్మాణ పనుల ప్రారంభానికి వెంటనే అనుమతులు మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు తాము పండించిన ధాన్యంలో కొంత భాగం కాశినాయన పేరు మీద అన్నదాన సత్రానికి తరలిస్తుంటారని, వాటితోనే అన్నదాన కార్యక్రమం సజావుగా సాగుతోంన్నారు. ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్న అన్నా క్యాంటీన్, డొక్కాసీతమ్మ భోజనాల కంటే ఎన్నో రెట్లు నాణ్యమైన భోజనం ఇక్కడ అందిస్తున్నారన్నారు. ఎంతో మంది నిరాశ్రయులు, ఒంటరి మహిళలు కాశినాయన ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్నారని, కూల్చివేయడం సరికాదన్నారు. స్వయం ప్రకటిత హిందూమత రక్షకుడు పవన్‌కళ్యాణ్ వారం రోజులుగా ఇలాంటి చర్యలు జరుగుతుంటే స్పందించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో సీపీఎం పోరుమామిళ్ల మండల కార్యదర్శి భైరవ ప్రసాద్, బి.మఠం కార్యదర్శి సునీల్‌కుమార్, సీపీఎం నాయకులు పాల్గొన్నారు.