
మహిళపై కత్తితో దాడి
కమలాపురం : కమలాపురం పట్టణంలో పట్ట పగలే ఇంట్లోకి దూరి కళ్లల్లో కారం చల్లి కత్తితో దాడి చేసి బంగారు నగలు, నగదు దోచుకెళ్లిన ఘటన గురువారం జరిగింది. పోలీసులు, స్థానికుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని గిడ్డంగి వీధిలో నివాసం ఉన్న కరంగుడి లక్ష్మిదేవి అనే మహిళపై అదే వీధికి చెందిన ఆకుల నవీన్ కత్తితో దాడి చేశాడు. మధ్యాహ్నం సమయంలో ఇంట్లో లక్ష్మీదేవి ఒంటరిగా ఉన్న విషయం తెలుసుకున్న నిందితుడు ఇంట్లోకి చొరబడి మహిళ కళ్లల్లో కారం చల్లి కత్తితో ముఖం, మెడ, చేతులు, కాళ్లు, గొంతు వద్ద విచక్షణా రహితంగా పొడిచాడు. దీంతో లక్ష్మీదేవి తీవ్రంగా గాయపడింది. ఈ నేపథ్యంలో నిందితుడు లక్ష్మీదేవి ఒంటిపై ఉన్న సరుడు, గాజులు తదితర 10 తులాల మేరకు బంగారు నగలు అపహరించుకు వెళ్లాడు. ఈ ఘటన తెలుసుకున్న ఇరుగు పొరుగు వారు అచేతన స్థితిలో పడి ఉన్న లక్ష్మీదేవిని కమలాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెకు ప్రథమ చికిత్స చేసి మెరుగైన చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. కాగా బాధితురాలు మాట్లాడుతూ పిన్ని అని పిలిచి ఇంట్లోకి దూరి కారం చల్లి కత్తులతో దాడి చేసి తన ఒంటిపై ఉన్న 10 తులాల బంగారు నగలు దోచుకెళ్లాడని, తనకు, తన బిడ్డలకు న్యాయం చేయాలని రోదించింది. కాగా బాధితురాలి భర్త శేఖర్ మాట్లాడుతూ ఇంట్లో ఎవరూ లేని సమయంలో చొరబడి ఇంత ఘోరం చేశాడని బంగారుతో పాటు, రూ.3లక్షల నగదు అపహరించుకు వెళ్లాడన్నారు.
గాలింపు చర్యలు చేపట్టాం: సీఐ ఎస్‌కే రోషన్
గిడ్డంగి వీధికి చెందిన లక్ష్మీదేవిపై దాడి చేసిన ఆకుల నవీన్‌ను పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టామని సీఐ ఎస్‌కే రోషన్ తెలిపారు. లక్ష్మీదేవి ఇంట్లో ఒంటరిగా ఉందని తెలుసుకున్న నవీన్ ఇంట్లోకి చొరబడి కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
బంగారు, నగదు అపహరణ
నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు

మహిళపై కత్తితో దాడి