ఆలేరు : ఆలేరు పట్టణంలో ఆదివారం రాత్రి జై జగన్నాథ నినాదాలు.. వేద పండితుల మంత్రోచ్ఛరణలు..భక్తుల సంకీర్తనలతో శ్రీజగన్నాథ స్వామి రథయాత్ర అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు జూకంటి సంపత్, జెట్ట నీరజ పాల్గొని రథయాత్రను ప్రారంభించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే బంగారు చీపురులతో రథం ముందు శుభ్రం చేశారు. ప్రత్యేక పూజల అనంతరం సంప్రదాయబద్ధంగా జగన్నాథ స్వామి రథాన్ని తాడుతో లాగి స్వామివారి సేవలో పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు హరే కృష్ణ నామస్మరణ చేస్తూ రథాన్ని లాగుతూ ముందుకుసాగటంతో పట్టణ వీధుల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. కార్యక్రమంలో విద్యావేత్త బండిరాజుల శంకర్, ఇస్కాన్ ప్రతినిధులు, బీజేపీ పట్టణ అధ్యక్షుడు గంగేష్, న్యాయవాది సీసా రవి, రంగనాయకుల దేవాలయం అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


