వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా చిన్నపిల్లలతో పాటు పెద్ద వారు కూడా త్వరగా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి వైద్యులను సంప్రదించాలి. ప్రస్తుత సీజన్‌లో కలుషిత ఆహారం, అపరిశుభ్రమైన నీటి వల్ల టైఫాయిడ్, విరేచనాలు వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పిల్లలకు వేడి చేసి చల్లార్చిన నీటిని మాత్రమే తాగించాలి. దోమతెరలను వినియోగించడంతో పాటు, శరీరం పూర్తిగా కప్పబడేలా నిండు వస్త్రాలను ధరింపజేయాలి.
–డాక్టర్ అరుణకుమారి, సూపరింటెండెంట్, యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రి
భువనగిరి: వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా చిన్నారుల ఆరోగ్యం క్షీణిస్తోంది. వర్షాలు పడాల్సిన సమయంలోనూ పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం.. భరించలేని ఉక్కపోతతో పిల్లలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జ్వరం, తలనొప్పి, విరేచనాలు వంటి లక్షణాలతో అస్వస్థతకు గురవుతున్నారు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రులకు రోగుల తాకిడి క్రమంగా పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్యం సకాలంలో అందుబాటులో లేక నిరుపేదలు పట్టణాల్లోని ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి ఆర్థికంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
ఆస్పత్రులకు పోటెత్తుతున్న రోగులు
జిల్లా కేంద్ర ఆస్పత్రితో పాటు రామన్నపేట, ఆలేరు, చౌటుప్పల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు రోగుల తాకిడి పెరిగింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం పూర్తిగా లోపించడంతో వ్యాధులు విజృంభిస్తున్నాయి. జనవాసాల మధ్య మురుగు నీరు నిల్వ ఉండి, వాటిని సకాలంలో శుభ్రం చేయకపోవడం వల్ల దోమలు విపరీతంగా పెరిగిపోయి రోగాల బారినపడాల్సి వస్తోంది. ఒక్క జిల్లా కేంద్ర ఆస్పత్రిలోనే రోజుకు సుమారు 100 నుంచి 150 వరకు చిన్నపిల్లల ఓపీ కేసులు నమోదవుతున్నాయి. ఇందులో జ్వరం, తీవ్రమైన దగ్గు, జలుబుతో బాధపడుతున్న 10 నుంచి 12 మంది చిన్నారులను ఆస్పత్రిలో చేర్చుకుని రెండు రోజుల పాటు ప్రత్యేక నిఘాలో ఉంచి చికిత్స చేస్తున్నారు.
వాతావరణ మార్పులతో అనార్యోగం బారిన పిల్లలు
ఫ ప్రభుత్వ ఆస్పత్రులకు రోగులతాకిడి
ఫ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో రోజూ 150 దాటిన చిన్నపిల్లల ఓపీ


