చిటుక రోగం (ఈటీ) : దీనిని గడ్డి రోగం, ముచ్చువ్యాధి, పాటు రోగం, మెడ సరంగా పేర్కొంటారు. ఈ వ్యాధి బ్యాక్టీరియా ద్వారా గొర్రెలు, మేకలలో వేగంగా వ్యాపించి మరణాలను కలిగిస్తుంది. గొర్రెలు, మేకలు ఎక్కువగా పచ్చిగడ్డి లేదా ధాన్యం మేసినప్పుడు ేజీర్ణక్రియలో మార్పులు వస్తాయి. వర్షం కురిసిన తర్వాత మొలిచిన మొలకలను అతిగా మేయడం వలన శరీరంలో ఎస్పిలాన్ అనే విష పదార్థం విడుదలై వ్యాధి వ్యాప్తికి కారణమవుతుంది. ఈ విషం రక్తంలో కలవడం వలన జీవం నిమిషాల్లో చనిపోతుంది.
వ్యాధి లక్షణాలు : ఈ వ్యాధి సోకిన రాత్రికిరాత్రే అకస్మాత్తుగా చనిపోతాయి. జ్వరం, పళ్లు కొరకడం, వనకడం, బిగుసుకుపోవడం, కాళ్లతో పొట్టను తన్నుకోవడం, తలను చెట్లకు గట్టిగా ఆనించి ఉండడం, కాళ్లు బిగిసి నడవడం, శ్వాస తీసుకోవడం కష్టంగా మారడం లక్షణాలు కనపడతాయి. ఎలాంటి రోగ లక్షణాలు కనిపించకుండా ఒకేసారి గాలిలోకి ఎగిరి కిందపడి మరణిస్తాయి. వ్యాధి తీవ్రమైతే విరోచనాలు, కడుపునొప్పి, మేత తినకపోవడం కనిపిస్తుంది.
చికిత్స : ఈ వ్యాధిని ప్రారంభ దశలో గుర్తిస్తే పెన్సిలిన్ లేదా ఆక్సిటెట్రాసైక్లిన్ వంటి ఇంజెక్షన్‌లు వేయించాలి. విరోచనాలు తగ్గడానికి నెబ్లాట్ 10–15 గ్రాముల యాంటిబయోటిక్ తాగించాలి. డైక్ల్రోజ్ సైలెన్ రక్త కణాల్లోకి ఎక్కించాలి. మే, జూన్ నెలల్లో టీకాలు వేయించాలి. వ్యాధి సోకిన పశువును మంద నుంచి వేరుగా ఉంచాలి. పశువుల పాకను శుభ్రంగా, పొడిగా ఉంచుకోవాలి. పశువుల మేతను ఒక్కసారిగా మార్చకూడదు. ఎండిన గడ్డి నుంచి పచ్చగడ్డికి కొద్దికొద్దిగా అలవాటు చేయాలి.
పెద్దవూర : తొలకరి వర్షాలతో భూమిపై మొలిచే పచ్చికను మేయడం, గుంతల్లో నిలిచిన నీటిని తాగడం వలన పశువులకు గొంతువాపు, జబ్బవాపు, చిటుక రోగం సంక్రమించే అవకాశం ఉంది. పశువుల కాపరులు జీవాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని, వాటిలో వస్తున్న మార్పులకు అనుగుణంగా వైద్యం అందించాలని పెద్దవూర మండల పశువైద్యాధికారి నులక నాగార్జున్‌రెడ్డి సూచిస్తున్నారు.
కలుషిత నీటితో జాగ్రత్త
● గుంతల్లో నిలిచిన నీటిలో పరాన్న జీవులు, అంతరపరాన్న జీవులు, సూక్ష్మజీవులు చేరుతాయి. ఆ నీటిని తాగి జీవాలు రోగాల బారిన పడే అవకాశాలు ఉంటాయి. వీలున్నంత వరకు బోరు, బావుల నీటినే తాగించాలి.
● వర్షపు జల్లులు, చలిగాలుల వలన పశువులు చలి జ్వరానికి లోనై మేత తినకపోవడం, నీరసించడం, ఊపిరితిత్తుల వ్యాధులకు లోనయ్యే ప్రమాదం ఉంది. అస్వస్థతకు గురైన వెంటనే వైద్యులను సంప్రదించాలి.
● చిత్తడి ఉన్న ప్రదేశంలో పశువులను ఎక్కువకాలం కట్టేయడం, మేతకు తిప్పడం వలన కాలి గిట్టలు మెత్తబడి పుండ్లు ఏర్పడతాయి. వీలైనంత వరకు మెరక, పొడి ప్రదేశాల్లో పశువులను ఉంచాలి. పశవుల పాకలో బ్లీచింగ్ పౌడర్ చల్లాలి.
● తడిసిన గడ్డి బూజుపట్టే అవకాశం ఉంటుంది. బూజు పట్టిన గడ్డి మేపడం వలన పశువులు అస్వస్థతకు గురవుతాయి. తడిసిన గడ్డి ఎండబెట్టి తగు మోతాదులో సోడియం బైకార్బోనేట్ కలిపి పశువులకు అందించాలి.
జబ్బవాపు వ్యాధి(బీ.క్యూ) : దీనిని సప్పవాపు వ్యాధి అని కూడా అంటారు. క్లాస్టీడియం చోవై అనే బ్యాక్టీరియా ద్వారా పశువులకు సోకే అంటువ్యాధి ఇది. ఆరు మాసాల యుక్త వయసులో ఉన్న పెయ్యలకు ఎక్కువగా ఈ వ్యాధి సోకుతుంది. ఇది వర్షం కురిసినప్పుడు ఎక్కువగా సోకుతుంది.
వ్యాధి లక్షణాలు : ఈ వ్యాధి సోకిన జీవాల్లో 106–108 డిగ్రీల జ్వరం ఉంటుంది. నీరసం, నెమరు వేయకపోవడం, శ్వాస కష్టంగా తీసుకోవడం తదితర లక్షణాలు కనిపిస్తాయి. సూక్ష్మజీవులు, తొడ, భుజం ప్రాంతంలోని కండరాలకు ఆశించి మాంసం కుళ్లిపోయేలా చేస్తుంది. తద్వారా పశువులు వాపుతో కుంటుతాయి. వాపు వద్ద కరకరమనే శబ్దం వస్తుంది. వాపు ప్రారంభంలో ఎర్రగా, నొప్పిగా ఉండి రాసురాను నొప్పిలేకుండా పోతుంది. రక్తంలో విష పదార్ధాల ప్రభావం వలన పశువులు 12 నుంచి 48 గంటల్లో మృత్యువాత పడతాయి.
చికిత్స : వ్యాధి ప్రారంభంలో పెన్సిలిన్ ఆక్సీ వంటి యాంటిబయోటిక్ ఇవ్వాలి. ఆంటీ పైరెటిక్స్, ఆంటీ ఇప్టామిన్స్ వాడాలి. కార్డీ జోన్స్, డ్రైక్ట్రోజ్ నార్మన్ సెలిన్ ఇవ్వాలి.
ఫ పశువుల్లో గొంతువాపు, జబ్బవాపు
వ్యాధులు ప్రబలే అవకాశం
ఫ పెద్దవూర మండల పశువైద్యాధికారి నాగార్జున్‌రెడ్డి సూచనలు
గొంతువాపు వ్యాధి(హెచ్.ఎస్) : వర్షాకాలంలో గేదెలు, ఆవులకు సోకే వ్యాధుల్లో గొంతు వాపు వ్యాధి ప్రమాకరమైంది. దీనినే గురక వ్యాధి అని కూడా అంటారు. తొలకరి వర్షాలు కురిసే సమయాల్లో ఈ వ్యాధి ఎక్కువగా సోకుతుంది. ఈ వ్యాధి పాస్చురెల్లా మల్టోసిడా అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. సాధారణంగా పశువుల శ్వాసకోశంలో ఉండే ఈ బ్యాక్టీరియా వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు లేదా పశువుల రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు చురుగ్గా మారి వ్యాధిని కలిగిస్తుంది. గాలికుంటు వ్యాధి ప్రబలిన ప్రాంతాల్లో గొంతువాపు వ్యాధి ఎక్కువగా సోకుతుంది. అకాల వర్షాలు కురిసినప్పుడు ఈ వ్యాధి ఎక్కువగా సోకే అవకాశం ఉంది. కలుషితమైన నీటి ద్వారా మేకలు, గొర్రెలకు సోకుతుంది. జీవాలు చాలా ఎక్కువ దూరం ప్రయాణించడం వలన కూడా ఈ వ్యాధి సోకుతుంది.
వ్యాధి లక్షణాలు : పశువుల శరీర ఉష్ణోగ్రత 104–106 ఫారన్‌హీట్‌తో తీవ్రమైన జ్వరం వస్తుంది. దవడ కింద, గొంతు, రొమ్ముభాగంలో కింద భాగాన గట్టిగా, నొప్పిగా ఉండే వాపు కనబడుతుంది. పశువు నోరు తెరిచి నాలుక బయటపెట్టి కష్టంగా శ్వాస తీసుకుంటుంది. శ్వాస తీసుకునేటప్పుడు గరగర లేదా గుర్రుగుర్రు అనే శబ్దం వస్తుంది. నోటి నుంచి సొంగ, ముక్కు నుంచి చీమిడి కారుతుంది. కళ్లు ఎర్రబడతాయి. పశువు మేత మేయడం, నీరు తాగడం పూర్తిగా బంద్ చేస్తుంది. చికిత్స అందకపోతే 12 నుంచి 48 గంటల్లో మృత్యువాత పడుతుంది.
చికిత్స : ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తే పశువైద్యుడిని సంప్రదించాలి. బ్యాక్టీరియాను చంపడానికి సల్ఫాడ్రగ్స్, ఆక్సిటెట్రాసైక్లిన్, లేదా ఎన్రోప్లోక్సాసిన్ వంటి యాంటిబయోటిక్ ఇంజెక్షన్‌లు వైద్యుని సలహా మేరకు ఇవ్వాలి. వాపు, జ్వరం తగ్గడానికి మెలోక్షికామ్ లేదా ఫ్లునిక్షిన్ మెగ్లుమైన్ మందులను ఇవ్వాలి. గొంతువాపు వ్యాధి రాకుండా ముందస్తు వ్యాక్సినేషన్ ఒక్కటే సరైన మార్గం.


