పండ్ల తోటల్లో ..
పండ్ల తోటల్లో జనుము పంట సాగు చేసుకోవడం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. పండ్ల మొక్కలు కాపునకు వచ్చేంత వరకు అంతరంగా జనుమును సాగు చేసి పూత వచ్చే సమయంలో కలియదున్నాలి. ఎకరాకు 16 కిలోల జనుము విత్తనాలు సరిపోతాయి. పండ్ల తోటలు ఏపుగా ఎదగడానికి పచ్చిరొట్ట ఎరువు ఎంతగానో దోహదపడుతుంది. భూమిలో సేంద్రియ కర్బనం పెరిగి పండ్ల మొక్కలు తెగుళ్ల బారిన పడకుంగా ఉంటాయి. ఎకరాకు 10 క్వింటాళ్ల పచ్చిరొట్ట తయారవుతుంది. రసాయన ఎరువులు అధికంగా వాడటం వల్ల జరిగే నష్టాన్ని పచ్చిరొట్ట ఎరువు ద్వారా తక్కువ ఖర్చుతో భర్తీ చేయవచ్చు. పండ్ల తోటల్లో జనుము సాగు వల్ల కలుపు మొక్కల సమస్య ఉండదు. పచ్చిరొట్టను పండ్ల తోటల పాదుల్లో వేసి మట్టితో కప్పి వేయాలి. పచ్చిరొట్ట ఎరువుగానే కాకుండా పశుగ్రాసంగా కూడా ఉపయోగపడుతుంది.
గుర్రంపోడు : ప్రస్తుత వానాకాలం సీజన్‌లో ప్రధాన పంటల సాగుకు ముందు రైతులు తమ వ్యవసాయ భూముల్లో పచ్చిరొట్ట పంటలైన జనుము, జీలుగ సాగు చేసుకుని భూమిలో కర్బన సేంద్రియం పెంచుకోవాలని గుర్రంపోడు మండల వ్యవసాయాధికారి కంచర్ల మాధవరెడ్డి సూచిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుత సీజన్‌లో జాతీయ, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్ధలు పచ్చిరొట్ట విత్తనాలను వ్యవసాయశాఖ ద్వారా 50శాతం రాయితీపై పంపిణీ చేస్తున్నాయి. ఆయా మండల కేంద్రాల్లో ఎంపిక చేసిన కేంద్రాల్లో వ్యవసాయశాఖ పర్యవేక్షణలో పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ చేస్తున్నారు. పచ్చిరొట్ట ఎరువుల వలన కలిగే ఉపయోగాలు ఆయన మాటల్లోనే..
సాధారణంగా తొలకరి వర్షాలకు పచ్చిరొట్ట పంటలు సాగు చేసుకుని పూత దశలో కలియదున్నడం వల్ల సేంద్రియ ఎరువులా పనిచేసి ప్రధాన పంట పైరుకు బలానిస్తుంది. భూమిలో సేంద్రియ కర్బనం తక్కువగా ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో మూడు శాతం పైగా సేంద్రియ కర్బనం ఉండగా మన దేశంలో ఒక్క శాతానికి మించి ఉండటం లేదు. భూమిలో సేంద్రియ కర్బనం పెంచేందుకు పచ్చిరొట్ట పంటలు వేయాలి. మే రెండో పక్షం నుంచి జులై రెండో పక్షం వరకు రైతులు ఏ పంటలు వేయరు కాబట్టి ఇటువంటి సమయంలో పచ్చిరొట్ట పంటలైన జనుము, జీలుగ, పిల్లి పెసర లాంటి పంటలు సాగు చేసుకుంటే ఎకరాకు పది టన్నుల పచ్చిరొట్ట ఎరువు వస్తుంది. ఈ పంటలు పూత దశలో నేలలో కలియదున్నడం ద్వారా ఎకరాకు 25 నుంచి 35 కిలోల నత్రజని, ఐదు కిలోల పొటాష్ లభ్యమవుతంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రైతులు జనుము, జీలుగలు సాగు చేసుకునేలా వ్యవసాయ శాఖ రాయితీపై విత్తనాలు పంపిణీ చేస్తుంది. జీలుగ విత్తనాలను వ్యవసాయశాఖ రాయితీపై 30 కిలోల బస్తా రూ.2,452కు, జనుము 40 కేజీల బస్తా రూ.3,110కు పంపిణీ చేస్తుంది.
వరి మాగాణుల్లో ..
వరి మాగాణుల్లో జీలుగ సాగు చేసుకోవడానికి ఎంతో అనువుగా ఉంటుంది. దుక్కిని బాగా దున్నుకుని ఎకరాకు 12 కిలోల జీలుగ విత్తనాలు వేసుకోవాలి. వరి నాటు వేసే నాటికి పూత దశలో ఉండే జీలుగను కలియదున్నడం వల్ల రసాయన ఎరువుల ఖర్చు తగ్గుతుంది. 45 రోజులు మించకుండా జీలుగకు నీళ్లు పెట్టి కలియదున్నాలి.
గుర్రంపోడు మండల వ్యవసాయ అధికారి మాధవరెడ్డి సూచనలు


