ఒక అడవిలో ఒక సింహం చెట్టు కింద హాయిగా నిద్రపోతోంది. ఆ సమయంలో ఒక చిన్న ఎలుక అక్కడికి వచ్చి, సరదాగా సింహం శరీరంపైకి ఎక్కి అటు ఇటు పరుగెత్తసాగింది. దాంతో సింహానికి నిద్రభంగం కలిగి, కోపంతో ఆ ఎలుకను తన పంజాతో గట్టిగా పట్టుకుంది. ఎలుక భయంతో వణుకుతూ, ‘మహారాజా! నన్ను క్షమించండి. తెలియక తప్పు చేశాను. నన్ను చంపకండి, నన్ను వదిలేస్తే ఎప్పటికై నా మీ ఆపదలో నేను మీకు సహాయం చేస్తాను’ అని వేడుకుంది. అంత చిన్న ఎలుక తనకు సహాయం చేయడం ఏమిటని సింహం నవ్వి, జాలితో దాన్ని వదిలేసింది. కొన్ని రోజుల తర్వాత, ఆ సింహం ఒక వేటగాడు వేసిన వలలో చిక్కుకుంది. వల నుంచి బయటపడలేక అది గట్టిగా గర్జించసాగింది. ఆ గర్జన విన్న ఎలుక వెంటనే అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చింది. తన పదునైన పళ్లతో వల తాళ్లను కొరికేసింది. అలా సింహం వల నుండి విముక్తి పొందింది. ఆ రోజు నుండి సింహం, ఎలుక మంచి స్నేహితులయ్యాయి.
నీతి : ఎవరినీ వారి పరిమాణాన్ని బట్టి తక్కువ అంచనా వేయకూడదు. మనం చేసే చిన్న సహాయం కూడా ఎప్పటికై నా మనకు మేలు చేస్తుంది.


