భూదాన్‌పోచంపల్లి : రోడ్డు ప్రమాదంలో గాయపడి కోమాలోకి వెళ్లిన వ్యక్తి 45 రోజుల తర్వాత గురువారం మృతిచెందాడు. భూదాన్‌పోచంపల్లి మండలం జలాల్‌పురం గ్రామానికి చెందిన మత్స్య కార్మికుడు గుండ్ల నర్సింహ (42) జీహెచ్‌ఎంసీలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. 45 రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బంధువుల పెళ్లికి వెళ్లి బైక్‌పై తిరిగి ఇంటికి వస్తుండగా రాయపోల్ గ్రామం వద్ద రోడ్డు పక్కన ఆపిన కారు డ్రైవర్ అకస్మాత్తుగా డోరు తెరవడంతో నర్సింహ తగిలి కిందపడ్డాడు. అతడి తలకు తీవ్ర గాయాలై కోమాలోకి వెళ్లాడు. కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సుమారు రూ.8 లక్షలు అప్పు చేసి చికిత్స చేయించినా నర్సింహ ఆరోగ్యం మెరుగుపడలేదు. దీంతో వారం క్రితం అతడిని ఇంటికి తీసుకొచ్చారు. గురువారం నర్సింహ ఆరోగ్యం విషమించడంతో కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో బీబీనగర్ ఎయిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.


