నాగార్జునసాగర్ : భూమిపై ఉన్న అన్ని జీవరాశులు, వాటి జన్యువులు, జీవావరణ వ్యవస్థల సమాహారమే జీవ వైవిధ్యం. జీవ వైవిధ్యం వల్లనే మానవ మనుగడ సాగుతుంది. కానీ ఆ మనిషి చేసే తప్పిదాల వలనే జీవ వైవిధ్యం ఎన్నడూ లేనంత ముప్పును ఎదుర్కొంటుంది. ఒకప్పుడు ప్రకృతి సహజంగా సంవత్సరానికి ఒక జీవజాతి మాత్రమే అంతరించేదని, కానీ ఇప్పుడు ప్రతి 20 నిమిషాలకు ఒక జీవజాతి కనుమరుగవుతుందని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అడవుల నరికివేత, కాలుష్యం, వాతావరణ మార్పులు తదితర కారణాలతో అనేక జీవరాశులు అంతరించిపోతున్నాయి. పురుగు మందులు, పరిశ్రమల నుంచి వెలువడే రసాయన వ్యర్థాలు నదుల్లో కలువడం వల్ల జలచరాలు నశిస్తు్‌ాన్నయి. ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా పక్షులు, జంతువులు మృత్యువాత పడుతున్నాయి. భూమి కాలుష్యం కారణంగా వానపాముల వంటి ఉపయోగకర జీవులు కూడా కనుమరుగవుతుతన్నాయి.
జీవ వైవిధ్యానికి పులి ఒక సంకేతం..
అడవుల్లో పులుల ఉనికి అక్కడి జీవ వ్యవస్థ సమతుల్యతను సూచిస్తుంది. పులుల సంఖ్య తగ్గిపోవడం జీవ వైవిధ్యానికి తీవ్రమైన ముప్పుగా పరిగణిస్తారు. అడవుల నరికివేత, అక్రమ వేట, గనుల తవ్వకాలతో పులుల మనుగడకు ప్రశ్నార్థకంగా మారింది. పులుల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం 1973లో ప్రాజెక్టు టైగర్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా టైగర్ రిజర్వ్‌లు ఏర్పాటు చేసి సంరక్షణ చర్యలు చేపట్టింది.
నల్లమల టైగర్ రిజర్వ్..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్‌గా ఉన్న నాగార్జునసాగర్–శ్రీశైలం పులుల అభయారణ్యం నల్లమల అడవుల్లో విస్తరించి ఉంది. ఇది జీవ వైవిధ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చింది. ఈ అభయారణ్యం 3,568 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఇది అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌గా పేరు మారింది.
మానవ తప్పిదాలతో దెబ్బతింటున్న
జీవ వ్యవస్థ సమతుల్యత
ప్రకృతిని కాపాడుకుంటేనే
మానవ మనుగడ సాధ్యమంటున్న
పర్యావరణవేత్తలు
నేడు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం
అతిపెద్ద అభయారణ్యం తెలంగాణలోనే..
తెలంగాణలో అటవీ ప్రాంతం 2,611.39 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఇందులో కోర్ ఏరియా 2,166.37 చదరపు కిలోమీటర్లు కాగా.. బఫర్ జోన్ 445.02 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉంది. కోర్, బఫర్ ఏరియాలో అడవిని వ్యవసాయ భూములుగా మార్చిన చోట ప్రభుత్వాలు గిరిజనులకు పట్టాలు ఇస్తూ వచ్చారు. వేల ఎకరాల్లో అడవులను నరికి వ్యవసాయ భూములుగా మార్చారు. గత ప్రభుత్వం హరితహారం పేరుతో చాలా చోట్ల మొక్కలను నాటి ప్రకృతి వనాలను పెంచింది. కానీ అవి సరిపోయే పరిస్థితితో లేవు. ప్రతి వ్యక్తి ఏడాదికో మొక్కను నాటి సంరక్షిస్తేనే అడవులు అంతరించినా గ్రామాలు, పట్టణాల్లో చెట్లు పెరిగి జీవ వైవిధ్యం సాధ్యమవుతుంది. జీవ వైవిధ్యాన్ని కాపాడి, ప్రకృతిని రక్షిస్తేనే భవిష్యత్తు తరాలకు సురక్షిత జీవనం సాధ్యమవుతుంది. ఇందు కోసం విద్యార్థులు మొక్కలు నాటేలా పాఠశాలల్లో అవగాహన కల్పించాలి. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, అడవులను సంరక్షించడం మనమందరం భాగస్వాములు కావాలి. అప్పుడే మానవ మనుగడ సాధ్యమవుతుంది.


