విద్యుత్‌ మోటార్లు చోరీ | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ మోటార్లు చోరీ

May 22 2026 1:22 PM | Updated on May 22 2026 1:22 PM

నడిగూడెం : మండల పరిధిలోని సిరిపురం గ్రామంలో సాగర్‌ ఎడమ కాల్వ కట్టపై రైతులు ఏర్పాటు చేసుకున్న నాలుగు విద్యుత్‌ మోటార్లను బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. గురువారం ఉదయం గమనించిన బాధిత రైతులు చిన్న రామయ్య, చెన్నయ్య, రామ్మూర్తి, ప్రకాశం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఒక్కో విద్యుత్‌ మోటారు విలువ రూ.40 వేలు ఉంటుందని బాధిత రైతులు తెలిపారు.

మట్టి తరలిస్తున్న టిప్పర్ల పట్టివేత

కొండమల్లేపల్లి : మండలంలోని చింతకుంట్ల గ్రామం నుంచి ఎర్ర మట్టిని తరలిస్తున్న రెండు టిప్పర్లను గురువారం కొండమల్లేపల్లి పోలీసులు పట్టుకున్నారు. ఎలాంటి అనుమతి లేకుండా ఎర్ర మట్టిని తరలిస్తున్నట్లు గుర్తించి వాహనాలను పోలీస్‌ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ అజ్మీరా రమేష్‌ తెలిపారు.

బైక్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఒకరు మృతి

సూర్యాపేటటౌన్‌ : బైక్‌ను ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన సూర్యాపేట పట్టణంలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట పట్టణంలోని భగత్‌సింగ్‌ నగర్‌కు చెందిన చెరుకు శ్రీను కుమారుడు చెరుకు గణేష్‌(19) ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. గురువారం పని నిమిత్తం గణేష్‌ బైక్‌పై ఖమ్మం క్రాస్‌ రోడ్డులోని అమ్మ గార్డెన్‌ వైపు వెళ్తుండగా.. ఖమ్మం నుంచి సూర్యాపేటకు వస్తున్న ఆర్టీసీ బస్సు ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్‌ చేయబోయి ఎదురుగా వస్తున్న గణేష్‌ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గణేష్‌కు తీవ్ర గాయలయ్యాయి. చికిత్స నిమిత్తం అతడిని సూర్యాపేట ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడు తండ్రి శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సూర్యాపేట పట్టణ పోలీసులు తెలిపారు.

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

అనంతగిరి : కోదాడ సమీపంలోని తమ్మర గ్రామ శివారులో కోటేశ్వరమ్మ చేపల మార్కెట్‌ వద్ద గురువారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడి వయసు 35 నుంచి 40 ఏళ్లు ఉంటాయని, తెల్ల పూలు కలిగిన బూడిద రంగు చొక్కా, నీలం రంగు జీన్స్‌ ప్యాంట్‌, తెలుపు రంగు బనియన్‌ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బస్సు కోసం ఎదురుచూస్తూ మృతిచెందాడని స్థానికులు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 87126 86046 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement