నాకు నచ్చిన పుస్తకం
హాయ్ ఫ్రెండ్స్.. నా పేరు మునం ఫాతిమా. మాది నల్లగొండ. నేను 8వ తరగతి చదువుతున్నాను. వేసవి సెలవుల్లో నేను డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఆత్మకథ ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’ పుస్తకాన్ని చదువుతున్నాను. ఈ పుస్తకం నాకు బాగా నచ్చింది. తమిళనాడు రాష్ట్రం రామేశ్వరంలోని ఒక సామాన్య కుటుంబంలో పుట్టి పట్టుదలతో చదివి, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా, దేశ ప్రథమ పౌరుడిగా ఎదిగిన ఆయన ప్రయాణం మానవీయ విలువలకు అద్దం పడుతుంది. కలాం తన చదువు కోసం ఎన్ని కష్టాలు పడ్డారో ఈ పుస్తకంలో వివరించారు. తన చదువుకు, కుటుంబానికి ఆసరాగా నిలవడం కోసం చిన్నప్పుడే ఆయన పత్రికలు పంచారు. విద్యార్థి అద్భుతాలు సృష్టించడంలో, ఉన్నత శిఖరాలు అధిరోహించడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంత గొప్పగా ఉంటుందో ఈ పుస్తకంలో ఉంది. తన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు శివసుబ్రహ్మణ్య అయ్యర్ .. పక్షులు ఎలా ఎగురుతాయో సముద్ర తీరంలో ప్రాక్టికల్గా చూపించి ఆయనలో సైన్స్ పట్ల ఆసక్తిని ఎలా రగిలించారో కలాం ఇందులో రాసుకున్నారు. ఉన్నత పాఠశాలలో అయ్యాదురై సోలమన్ లాంటి గురువులు తనలో ఆత్మవిశ్వాసాన్ని ఎలా నింపారో చదివితే చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. రామేశ్వరంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ వర్గాల మధ్య ఉన్న సోదరభావం, మనుషుల మధ్య ఉన్న అవినాభావ సంబంధాలు కలాం వ్యక్తిత్వాన్ని ఎలా తీర్చిదిద్దాయో ఈ ఆత్మకథలో అద్భుతంగా ఆవిష్కరించారు. సమాజంలోని మంచి వ్యక్తుల ప్రభావం ఒక గొప్ప పౌరుడిని ఎలా తయారు చేస్తుందో చెప్పడానికి ఇదొక సజీవ సాక్ష్యం. ఇస్రోలోఎస్.ఎల్.వి–3 ప్రాజెక్టు మొదటి సారి విఫలమైనప్పుడు అప్పటి చైర్మన్ సతీష్‌ధావన్ ఆ వైఫల్యం బాధ్యతను తాను తీసుకొని మరుసటి ఏడాది అదే ప్రాజెక్టు విజయవంతమైనప్పుడు ఆ క్రెడిట్ కలాం బృందానికి ఎలా ఇచ్చారో వివరించారు. ఫ్రెండ్స్ మీరు కూడా ఈ పుస్తకాన్ని చదవుతారు కదూ..


