ప్రభుత్వాస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వాస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం

May 22 2026 1:22 PM | Updated on May 22 2026 1:22 PM

నాగార్జునసాగర్‌ : నాగార్జునసాగర్‌లోని ప్రభుత్వాస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ మహిళ అంబులెన్స్‌లోనే ప్రసవించింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగార్జునసాగర్‌లోని హిల్‌కాలనీకి చెందిన మొహరున్నీసా బేగం(34)కు పురిటి నొప్పులు రావడంతో బుధవారం రాత్రి 10 గంటలకు ఆమెను కుటుంబ సభ్యులు స్థానిక కమలా నెహ్రూ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ సరైన డాక్టర్‌ అందుబాటులో లేడని చెప్పి ఆస్పత్రి సిబ్బంది కనీస వైద్య పరీక్షలు చేయకుండానే నల్ల గొండ ప్రభుత్వ ఆస్పత్రికి రెఫర్‌ చేశారు. చేసేదేమీ లేక 108 అంబులెన్స్‌లో నల్లగొండకు తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు ఎక్కువ కావడంతో ఈఎంటీ రాకేష్‌, పైలెట్‌ గణేష్‌ కలిసి ప్రసవం చేయడంతో మొహరున్నీసా బేగం మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే కమలా నెహ్రూ ఏరియా ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చే వారికి అక్కడి సిబ్బంది కనీసం ప్రథమ చికిత్స కూడా చేయకుండానే నల్లగొండ లేదా హైదరాబాద్‌కు ఎక్కువగా రెఫర్‌ చేస్తున్నారని, ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

విచారణ చేపడతాం : ఆస్పత్రి సీఎంఓ హరికృష్ణ

రాత్రి సమయంలో గర్భిణికి ప్రసవం చేయకుండా నల్లగొండకు ఎందుకు రెఫర్‌ చేశారో విచారణ చేపడతాం. డాక్టర్లు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.

అంబులెన్స్‌లో ప్రసవించిన మహిళ

Advertisement
 
Advertisement
Advertisement