చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడిన నిందితుల అరెస్టు | - | Sakshi
Sakshi News home page

చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడిన నిందితుల అరెస్టు

May 22 2026 1:22 PM | Updated on May 22 2026 1:22 PM

మిర్యాలగూడ అర్బన్‌ : చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడిన నలుగురు దొంగలను మిర్యాలగూడ రూరల్‌ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం డీఎస్పీ రాజశేఖర రాజు తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 28న మిర్యాలగూడ మండలం జప్తివీరప్పగూడెంలో బైసిని లక్ష్మమ్మ నిర్వహిస్తున్న కిరాణా దుకాణం వద్దకు హుజూర్‌నగర్‌ మండలం వేపలసింగారం గ్రామానికి చెందిన సూరోజు భార్గవచారి, మిట్టగూడెం గ్రామానికి చెందిన పఠాన్‌ అశ్రఫ్‌ వచ్చారు. వారిద్దరు లక్ష్మమ్మ దుకాణంలో మద్యం సేవించి రూ.500 నోటు ఆమెకు ఇచ్చారు. చిల్లర కోసం లక్ష్మమ్మ ఇంట్లోకి వెళ్లగా.. వెనకాలే ఇద్దరు నిందుతులు కూడా వెళ్లి ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కొని అప్పటికే గ్రామ శివారులో బైక్‌పై వేచి చూస్తున్న హుజూర్‌నగర్‌ మండలం వేపలసింగారం గ్రామానికే చెందిన దండగల వినోద్‌కుమార్‌, శివనాగ మల్లికార్జునరావుతో కలిసి పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మిర్యాలగూడ రూరల్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చోరీ చేసిన బంగారు గొలుసును విక్రయించేందుకు గురువారం నలుగురు నిందితులు మిర్యాలగూడకు వస్తుండగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. వారి నుంచి బంగారు గొలుసుతో పాటు మూడు ద్విచక్ర వాహనాలు, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. నిందుతులు మార్చి 21న చింతపల్లి గ్రామంలో గుంపుల సైదులు అనే వ్యక్తికి చెందిన ద్విచక్ర వాహనాన్ని సైతం దొంగిలించినట్లు పేర్కొన్నారు. డీఎస్పీ వెంట రూరల్‌ సీఐ పీఎన్‌డీ ప్రసాద్‌, ఎస్‌ఐ లక్ష్మయ్య ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement