మిర్యాలగూడ: బోరు మోటారు బిగిస్తుండగా విద్యుదాఘాతానికి గురై గ్రామ పంచాయతీ కార్మికుడు మృతిచెందాడు. ఈ ఘటన బుధవారం దామరచర్ల మండల కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దామరచర్ల మండల కేంద్రానికి చెందిన ముడుసు సైదులు(45) గ్రామ పంచాయతీలో ఎంపీడబ్ల్యూ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా బుధవారం ఉదయం గ్రామంలోని సాయిదుర్గానగర్‌లో బోరు మోటారు బిగిస్తుండగా విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.
గోడ కూలి మహిళ మృతి
గుర్రంపోడు: ఈదురుగాలులకు గోడ కూలి మీద పడి మహిళ మృతిచెందింది. ఈ ఘటన గుర్రంపోడు మండలం పార్లపల్లిలో మంగళవారం రాత్రి జరిగింది. పార్లపల్లికి చెందిన పోతురాజు సురేందర్ మంగళవారం రాత్రి ఇంటి ముందు వరండాలో మంచంపై నిద్రించగా.. పక్కనే నేలపై ప్రేమలత (25) నిద్రించింది. రాత్రి ఈదురుగాలులు వీచడంతో ఇంటి ముందున్న గోడ కూలి ప్రేమలత మీదపడటంతో మృతిచెందింది. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మృతురాలి భర్త సురేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకన్న తెలిపారు.


