యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నృసింహ జయంత్యోత్సవాలు బుధవారం నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంఆ ఉదయం అర్చకులు నిత్యారాధనలు చేపట్టారు. అనంతరం లక్ష్మీనరసింహస్వామిని అలంకరించి తిరు, మాడ వీధుల్లో ఊరేగించి ఉత్తర మాడ వీధిలోని యాగశాలలోకి తీసుకెళ్లి అధిష్ఠించారు. ఆ తర్వాత యాగశాలలో ద్వారతోరణ పూజ, మూర్తికుంభ ఆరాధన, చతుఃస్థానార్చన, లక్ష్మీనృసింహ సుదర్శన గరుడ మూలమంత్ర హోమం, నిత్య పూర్ణాహుతి చేపట్టారు. ఆయా వేడుకల్లో ఈఓ భవానీ శంకర్, అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి, ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, బి. సురేంద్రాచార్యులు, అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
సాయంత్రం శ్రీరామ అలంకారంలో..
సాయంత్రం నిత్యారాధనలు, సాయమారాధన, ద్వారతోరణపూజ, చతుఃస్థానార్చన, లక్ష్మీనృసింహ సుదర్శన గరుడ మూలమంత్ర హవనం, నిత్య పూర్ణాహుతి చేపట్టారు. అంతకుముందు నృసింహస్వామిని శ్రీరాముడిగా అలంకరించి ఊరేగించారు. సేవకు ముందు అర్చకులు, పారాయణీకులు వేద పారాయణం పఠించారు.
పాతగుట్టలో..
యాదగిరీశుడి ఆలయానికి అనుబంధంగా ఉన్న పూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సైతం జయంతి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉదయం ప్రాతరాధన, చతుఃస్థానార్చన, లక్ష్మీనృసింహ సుదర్శన, గరుడ మూలమంత్ర హోమం, నిత్య పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం లక్ష పుష్పార్చన చేపట్టారు. సాయంత్రం సాయమారాధన, చతుఃస్థానార్చన, మూలమంత్ర హవనం, నిత్య పూర్ణాహుతి నిర్వహించారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు..
మల్లాపురం గ్రామానికి చెందిన శ్రీరామ భజన మండలి, యాదగిరిగుట్టకు చెందిన శ్రీగాయత్రి మహిళ భజన మండలి ఆధ్వర్యంలో భజన నిర్వహించారు. సాయంత్రం దేవులపల్లి నాగ శ్రీదేవి భక్తి సంగీతం, హైదరాబాద్‌కు చెందిన శాంకరి నాట్యస్థల్, మయూరి నాట్య కళాక్షేత్రం కళాకారులు కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చారు.
నేటితో ముగింపు..
నృసింహ జయంతి ఉత్సవాలు గురువారం రాత్రి ముగియనున్నాయి.
ఫ నేటితో ముగియనున్న జయంత్యోత్సవాలు


