కనగల్ : రైస్ మిల్లర్ల కొర్రీలు, అధికారుల నిర్లక్ష్యం, రైతుల ఒత్తిడితో పీఏసీఎస్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి సెల్ఫీ వీడియో తీసి తన బాధను చెప్పకుంటూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా కనగల్ మండలంలో ఆదివారం సాయంత్రం జరిగింది. వివరాలు.. కనగల్ మండలం జి. యడవల్లి పీఏసీఎస్ కార్యాలయంలో స్టాఫ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కొప్పుల సైదులు కొద్దిరోజులుగా బచ్చన్నగూడెం ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం సేకరణ ఇన్‌చార్జిగా పనిచేస్తున్నాడు. కొనుగోలు కేంద్రంలో ఽరైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లర్ల వద్దకు పంపిస్తే రెండు మూడు రోజులైనా దిగుమతి చేసుకోవడంలేదని, ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వీడియోలో వాపోయాడు. కొనుగోలు కేంద్రంలో బస్తా 42 కేజీలు కాంటా వేసి పంపించినా మిల్లర్లు ధాన్యాన్ని బీ–గ్రేడ్ అని దిగుమతి చేసుకోకుండా ఆపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. రైతులను మిల్లర్లు ఇబ్బందులను గురిచేస్తున్నారని, రైతుల నుంచి సేకరించిన ధాన్యం కూడా కొనుగోలు కేంద్రంలో నిలిచిపోతుందని కన్నీటి పర్యంతమయ్యాడు. ఏమి చేయాలో అర్ధం కావడంలేదని, తప్పని పరిస్థితుల్లో సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నానని జి.యడవల్లి గ్రామ శివారులోని వ్యవసాయ పొలం వద్ద పురుగుల మందు తాగాడు. కేంద్రాల్లో పనిచేస్తున్న ఇన్‌చార్జిల మీద చాలా ఒత్తిడి ఉందని, అధికారులు స్పందించి తన ఆత్మహత్యతోనైనా ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగేటట్లు చూడాలని సైదులు వీడియో పేర్కొన్నాడు. ప్రస్తుతం సైదులు పరిస్థితి విషమంగా ఉందని గ్రామస్తులు తెలిపారు.
సైదులును పరామర్శించిన కంచర్ల భూపాల్‌రెడ్డి
నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సైదులును నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు. సైదులుకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. ఆయన వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి తదితరులున్నారు. సైదులును మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారని, ప్రస్తుతానికి అతడి పరిస్థితి విషమంగానే ఉందని గ్రామస్తులు పేర్కొంటున్నారు.
భారీగా చేరుకున్న గ్రామస్తులు..
సైదులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో గ్రామస్తులు, బంధువులు, రైతులు ఆస్పత్రికి భారీగా చేరుకుని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ జిల్లా నాయకుడు పిల్లి రామరాజు సైతం సైదులును పరామర్శించారు.
ఫ సెల్ఫీ వీడియోలో బాధను వెల్లడించిన సైదులు


