మిర్యాలగూడ అర్బన్: అద్దెకు తీసుకున్న కారు రోడ్డు ప్రమాదంలో దెబ్బతినడంతో దానిని రిపేర్ చేయించేందుకు డబ్బుల్లేక చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను బుధవారం డీఎస్పీ రాజశేఖర రాజు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం రేవూరు గ్రామానికి చెందిన జాజం నర్సింహారావు కుమారుడు జాజం గోపిచంద్ కొద్దినెలలుగా మిర్యాలగూడ పట్టణంలోని బాపూజీనగర్‌లో ఉంటూ స్థానికంగా వాటర్ ప్లాంట్‌లో పనిచేస్తున్నాడు. వాటర్ ప్లాంట్ ఆటో నడుపుతూ చెడు వ్యసనాలకు అలవాటుపడిన గోపిచంద్ సెల్ఫ్ డ్రైవింగ్ కారును అద్దెకు తీసుకోగా.. రోడ్డు ప్రమాదం జరిగి కారు దెబ్బతింది. కారును బాగుచేయించాలని అద్దెకు ఇచ్చిన వారు ఒత్తిడి చేయడంతో తన వద్ద డబ్బుల్లేక దొంగతనం చేయాలని గోపిచంద్ నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 27న మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డికాలనీలో గల సాంప్రదాయ హోటల్ సమీపంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న గౌరు వజ్రమ్మ మెడలోని బంగారు గొలుసును గోపిచంద్ లాక్కొని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మిర్యాలగూడ వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీఐ నాగభూషణరావు ఎస్ సైదిరెడ్డి నేతృత్వంలో రెండు బృందాలను ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి నిందుతుడిని గుర్తించారు. బుధవారం చోరీ చేసిన బంగారు గొలుసును విక్రయించడానికి మిర్యాలగూడకు వచ్చిన గోపిచంద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నిజం ఒప్పుకున్నాడు. అతడి నుంచి నాలుగు తులాల బంగారు గొలుసు, సెల్‌ఫోన్, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
ఫ నిందితుడిని పట్టుకున్న
మిర్యాలగూడ వన్‌టౌన్ పోలీసులు
ఫ రూ.4లక్షల విలువైన బంగారు గొలుసు, సెల్‌ఫోన్, బైక్ స్వాధీనం
ఫ వివరాలు వెల్లడించిన
డీఎస్పీ రాజశేఖర రాజు


