ఫ్రాంక్‌ పేమెంట్‌ యాప్‌ పేరుతో మోసం | - | Sakshi
Sakshi News home page

ఫ్రాంక్‌ పేమెంట్‌ యాప్‌ పేరుతో మోసం

Apr 30 2026 7:25 AM | Updated on Apr 30 2026 7:25 AM

చిట్యాల : ‘ఫ్రాంక్‌ పేమెంట్‌ యాప్‌’ ద్వారా మోసాలకు పాల్పడుతున్న ముఠా సభ్యుల్లో ఒకరిని చిట్యాల పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ కేసు వివరాలను నార్కట్‌పల్లి సీఐ కె. నాగరాజు బుధవారం వెల్లడించారు. ఏపీలోని అనకాపల్లికి చెందిన బుద్ద హేమసాయి అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టుమాస్టర్‌గా పనిచేస్తున్నాడు. అతడు తన స్నేహితులైన హరి, సురేష్‌, బాలుతో కలిసి జల్సాలకు అలవాటుపడి కొంతకాలంగా ‘ఫ్రాంక్‌ పేమెంట్‌ యాప్‌’ ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. వీరు ఈ నెల 25న ఏపీలోని విజయవాడ పడమట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఎస్‌బీఐ ఏటీఎం వద్ద డబ్బులు డిపాజిట్‌ చేసేందుకు వచ్చిన ఓ వ్యక్తికి ఫోన్‌ పే ద్వారా డబ్బులు పంపిస్తామని నగదును చేతికి ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో ఫ్రాంక్‌ పేమెంట్‌ యాప్‌ ద్వారా పేమెంట్‌ చేసినట్లు నకిలీ మెసేజ్‌ను చూపించి అతడి వద్ద రూ.13,000 తీసుకున్నారు. అనంతరం వీరు నలుగురు కలిసి కారులో హైదరాబాద్‌కు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో నల్లగొండ జిల్లా చిట్యాల పట్టణంలో వాహనాలు తనిఖీలు చేస్తున్న పోలీసులు కారును ఆపేందుకు యత్నించారు. పోలీసులతో దురుసుగా ప్రవర్తించి వారి నుంచి తప్పించుకునే క్రమంలో విజయవాడ–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై రాంగ్‌రూట్‌లో వెళ్లి స్థానికంగా వేణుగోపాలస్వామి వెంచర్‌లోకి వెళ్లి కారును పార్కింగ్‌ చేసి అక్కడి నుంచి పరారయ్యారు. కాగా బుధవారం చిట్యాల ఎస్‌ఐ మామిడి రవికుమార్‌ చిట్యాల బస్టాండ్‌ వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా.. నిందితుల్లో ఒకరైన బుద్ద హేమసాయి పట్టుబడ్డాడు. అతడిని అరెస్ట్‌ చేసి రూ.13,000 నగదు సాధ్వీనం చేసుకుని రిమాండ్‌ చేసినట్లు సీఐ తెలిపారు. మిగతా ముగ్గురు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. వీరి నలుగురిపై ఏపీలోని పలు పోలీస్‌ స్టేషన్లలో సైబర్‌ మోసాల కేసులతో పాటు ఇతర కేసులున్నట్లు సీఐ తెలిపారు.

ఫ ఒకరి అరెస్ట్‌

ఫ మరో ముగ్గురు పరారీ

Advertisement
 
Advertisement
Advertisement