సాక్షి, యాదాద్రి : రోడ్డు ప్రమాదాలను నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో ఎస్పీ అక్షాంశ్ యాదవ్, అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ, ట్రాఫిక్ డీఎస్పీ ప్రభాకర్‌రెడ్డి, జిల్లాస్థాయి అధికారులు, హైవే అధికారులు, ఇంజనీరింగ్, రవాణా అధికారుల సమీక్షతోపాటు అనంతరం నిర్వహించిన జిల్లా స్థాయి మాదకద్రవ్యాల సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. వాహనాల వేగ నియంత్రణకు రోడ్లపై రుంబుల్ స్ట్రిప్స్, స్టడ్స్, స్పీడ్ లిమిట్, సూచిక బోర్డులు, బ్లింకర్స్ వంటివి ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో మాదకద్రవ్యాల రవాణా, విక్రయం, వినియోగంపై గట్టి నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై కళాశాలల్లో అవగాహన కల్పించాలన్నారు. మాదకద్రవ్యాల నిల్వలు, సరఫరాపై ఆబ్కారీ శాఖ తనిఖీలు నిర్వహించాలన్నారు. సమావేశాల్లో డీఈఓ సత్యనారాయణ, డీపీఓ శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా ట్రాన్స్‌పోర్ట్ అధికారి సాయికృష్ణ, ఆర్డీఓ కృష్ణారెడ్డి, ఆర్ అండ్ బీ అధికారి సరిత, ఇతర అధికారులు పాల్గొన్నారు.


