సాక్షి, యాదాద్రి : రానున్న వానాకాలం సీజన్‌లో నకిలీ విత్తనాల తరలింపు, ఎరువుల లభ్యత, అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టిసారించాలని అదనపు కలెక్టర్ వెంకారెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా, మండల స్థాయి కార్యదళ సభ్యులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు సరఫరా చేసే యూరియా, విత్తనాలపై నిశిత పరిశీలన ఉండాలన్నారు. ఇందుకోసం జిల్లా, మండల పరిధిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ముఖ్యంగా నిషేధిత పత్తి విత్తనాల విక్రయాన్ని నిర్మూలించాలన్నారు. రాయితీపై అందజేసే యూరియా దుర్వినియోగం కాకుండా చూడాలన్నారు. సమావేశంలో డీఏఓ, రెవెన్యూ, పోలీస్, పరిశ్రమల శాఖ, పౌర సరఫరాలు, కార్మిక శాఖ అధికారులు పాల్గొన్నారు.
నేడు హన్మాపురానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రాక
భువనగిరి : భువనగిరి మండలం హన్మాపురం గ్రామానికి గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు రానున్నట్లు ఆ పార్టీ మండల అధ్యక్షుడు చీర్క సురేష్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఉదయం 9.30 గంటలకు సందర్శించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు హాజరు కావాలని కోరారు.


