రాజాపేట : మండలంలోని నెమిల గ్రామంలో తాళం వేసిన ఇళ్లలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. మంగళవారం బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నెమిల గ్రామానికి చెందిన మోతె నర్సింహులు, వానరాసి సమ్మయ్య, మోతె చినరాములు బతుకుదెరువు నిమిత్తం కొద్దిరోజుల క్రితం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. మంగళవారం వారు స్వగ్రామానికి వచ్చి చూసేసరికి వారి ఇళ్లకు వేసిన తాళాలు పగులగొట్టి ఉండటం, కిటికీల చువ్వలు విరిచి ఉండటంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. వానరాసి సమ్మయ్య ఇంట్లో రూ.3వేలు, సమ్మయ్య ఇంట్లో రూ.2వేలు గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ లింగారెడ్డి తన సిబ్బందితో గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
గుర్తుతెలియని మృతదేహాల కేసులు ముగిస్తాం
ఫ భువనగిరి టౌన్ పోలీసుల ప్రకటన
భువనగిరి : గతేడాది భువనగిరి పట్టణ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో లభ్యమైన మూడు గుర్తుతెలియని మృతదేహాలకు సంబంధించిన కేసులను ముగించనున్నట్లు భువనగిరి పట్టణ పోలీసులు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2025 సెప్టెంబర్ 23న స్థానిక పాత శిల్పా హోటల్ సమీపంలో ఓ వ్యక్తి మృతదేహం, అక్టోబర్ 26న స్థానిక బస్టాండ్‌లో మహిళ మృతదేహం లభ్యం కాగా.. అదే రోజున అనారోగ్యంతో భువనగిరి జిల్లా ఆస్పత్రిలో గుర్తుతెలియని మహిళ మృతిచెందిందని, ఈ మేరకు కేసులు నమోదు చేసి, నిబంధనల ప్రకారం వారం పాటు మృతదేహాలను జిల్లా ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచామని భువనగిరి టౌన్ ఎస్‌ఐ నరేష్ తెలిపారు. అనంతరం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో దహన సంస్కారాలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఇప్పటికై నా ఆ మూడు మృతదేహాలకు సంబంధించిన వివరాలు ఎవరికై నా తెలిస్తే 87126 62471, 87126 62803, 87126 6249 నంబర్లకు సంప్రదించాలని సూచించారు.
ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య
మోత్కూరు : ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురైన వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అడ్డగూడూరు మండలం మానాయికుంట గ్రామంలో సోమవారం జరిగింది. ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మానాయికుంట గ్రామానికి చెందిన బోడ వెంకటయ్య(50) కిరాణ దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన అతడు సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి పైకప్పుకు తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని వెంకటయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుమారుడు బోడ జశ్వంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
గుర్తుతెలియని మృతదేహాలు (ఫైల్)


