వలిగొండ : రైతుల భూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి ఆదేశించారు. మంగళవారం వలిగొండ తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. మండలంలో ప్రభుత్వ భూములు, వక్ఫ్‌భూములు, దేవాలయ భూములు ఎన్ని ఉన్నాయని తహసీల్దార్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గోదాములో గోనె సంచుల నిల్వలను పరిశీలించారు. ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. నాగారం సమీపంలోని వాసవి రైస్ ఇండస్ట్రీని సందర్శించి వచ్చే ధాన్యం సీజన్‌లో వడ్లు దిగుమతి చేసుకోవడంలో రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని మిల్లు యజమానికి సూచించారు. స్థానిక పెట్రోల్ బంకును తనిఖీ చేసి నిల్వలు తగ్గకుండా చూసుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ వెంట సివిల్ సప్లయ్ జిల్లా అధికారి హరికృష్ణ, తహసీల్దార్ దశరథ ఉన్నారు.
మహిళా సాధికారతే లక్ష్యం
భువనగిరి : మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని ఇందులో భాగంగా జిల్లాలో ప్రతి మండల సమాఖ్యకు ఒక బస్సు కొనుగోలు చేయడానికి అనుమతి లభించినట్లు అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం విజయవంతమైన సందర్భంగా మంగళవారం భువనగిరి పట్టణంలోని బస్టాండ్ ఆవరణంలో నిర్వహించిన మహిళా చైతన్య సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ప్రభుత్వ ఆస్పత్రి, పాఠశాలల్లో అందిస్తున్న ఉచిత సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ నాగిరెడ్డి, ఆర్డీఓ కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ తంగళ్లపలి శ్రీవాణి రవికుమార్, పోతంశెట్టి మంజల వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవెజ్ చిస్తీ, ఇన్‌చార్జి మున్సిపల్ కమిషనర్ కొండల్‌రావు, ఆర్టీసీ డీఎం మురళీకృష్ణ, రేణుక, పల్లవి, అలివేలు పాల్గొన్నారు.


