రాజాపేట : మానవాళికి హాని కలిగించే రసాయన ఎరువులకు బదులు సేంద్రియ సాగుపై రైతులు ప్రత్యేక దృష్టి సారించాలని యాదాద్రి భువనగిరి జిల్లా వ్యవసాయ అధికారి వెంకటరమణారెడ్డి అన్నారు. మంగళవారం రాజాపేట మండలం నెమిల గ్రామంలో పాలేకర్ విధానంలో సేంద్రియ పద్ధతిలో కూరగాయలు సాగుచేస్తున్న గుర్రాల సందీప్ వ్యవసాయ క్షేత్రాన్ని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సందర్శించారు. రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సేంద్రియ సాగుచేస్తున్న సందీప్‌ను అభినందించారు. సందీప్‌ను స్ఫూర్తిగా తీసుకుని రైతులు సేంద్రియ సాగు వైపు అడుగులు వేయాలని సూచించారు. ఈ సందర్భంగా డీఏఓ వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. రసాయన ఎరువులతో పంటలు సాగు చేయడం వలన క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం మునగ సాగు ఎంతో లాభదాయకంగా ఉందని, సేంద్రియ పద్ధతిలో సాగుచేసే రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహకం అందజేస్తుందని, జిల్లాలో మునగ సాగు కోసం ఎన్‌ఆర్‌ఈజీఎస్ ద్వారా కూలీల కోసం, మెటీరియల్, మొక్కల కోసం రూ.లక్ష రైతులకు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ శాంతినిర్మల, ఏఓ పద్మజ, హార్టికల్చర్ అధికారి సరస్వతి తదితరులు ఉన్నారు.


