● కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్ర ఆధారంగా డాక్యుమెంటరీ తీసిన భూదాన్‌పోచంపల్లి వాసి
● డిప్యూటీ సీఎం చేతులమీదుగా
అవార్డు అందుకున్న దర్శకుడు, నిర్మాత
భూదాన్‌పోచంపల్లి, చౌటుప్పల్ : ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ మలి ఉద్యమనేత, మాజీ మంత్రి దివంగత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్ర ఆధారంగా భూదాన్‌పోచంపల్లికి యువ దర్శకుడు బడుగు విజయ్‌కుమార్ దర్శకత్వంలో, చౌటుప్పల్‌కు చెందిన చిత్ర నిర్మాత ధనుంజయ్య రూపొందించిన ‘యూనిటీ’ ది మ్యాన్ ఆఫ్ సోషల్ జస్టిస్ డాక్యుమెంటరీ గద్దర్ అవార్డు–2026కు దక్కింది. ఈమేరకు గురువారం రాత్రి హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రముఖ నిర్మాత, ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్‌రాజు చేతుల మీదుగా దర్శకుడు బడుగు విజయ్‌కుమార్ అవార్డు, రూ.5లక్షల నగదు అందించి ఘనంగా సత్కరించారు.
బాధ్యతను పెంచింది
దర్శకుడు విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. గద్దర్ ఫిల్మ్ అవార్డు మరింత బాధ్యతను పెంచిందన్నారు. చిత్ర విజయంలో అండగా నిలిచిన నిర్మాత చిరందాస్ శ్రీకాంత్, ధనుంజయ్య, చిత్రంలో ప్రధానపాత్ర పోషించిన మైమ్ మధు, సాంకేతిక బృందానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చిత్ర నిర్మాత చిరందాసు ధనుంజయ్య మాట్లాడుతూ.. తాము రూపొందించిన డాక్యుమెంటరీ చిత్రానికి అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో ఇప్పటికే 12 అవార్డులు లభించాయని తెలిపారు. కాగా.. పోచంపల్లి వాసి రాష్ట్రస్థాయిలో గద్దర్ ఫిల్మ్ అవార్డు అందుకోవడం పట్ల పోచంపల్లి మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు, భారత లవకుమార్, కొండా లక్ష్మణ్‌బాపూజీ గ్లోబల్ ఫెడరేషన్ చైర్మన్, అడ్వకేట్ రాపోలు జ్ఞానేశ్వర్, ఎంఏ షరీఫ్, కార్టూనిస్ట్ దయానంద్, రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు.


