యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో భక్తులకు నిత్యం అందించే అన్న ప్రసాదానికి హైదరాబాద్‌కు చెందిన పాలమూరు సీడ్స్ నిర్వాహకులు సుదర్శన్‌రెడ్డి రూ.6లక్షల విరాళం అందజేశారు. శుక్రవారం సుదర్శన్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఈఓ భవాని శంకర్‌ను ఆయన కార్యాలయంలో కలిసి రూ.6లక్షల చెక్కు, డీడీలను అందించారు. విరాళాన్ని అన్న ప్రసాద కేంద్రంతో భక్తులకు నిత్య అన్నదానం కోసం ఖర్చు చేయాలని కోరారు.
గంజాయి పట్టివేత
సూర్యాపేటటౌన్ : గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి నాలుగు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ సీఐ వెంకటయ్య తెలిపారు. శుక్రవారం సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు వివరాలు వెల్లడించారు. ఎస్‌ఐ ఐలయ్య, సిబ్బంది, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పట్టణంలోని కొత్త వ్యవసాయ మార్కెట్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం సోదాలు నిర్వహించి అనుమానాస్పదంగా ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిపారు. వారి వద్ద ఉన్న 4 కేజీల గంజాయి పట్టుకున్నట్లు చెప్పారు. నిందితులను సూర్యాపేట పట్టణంలోని భగత్ సింగ్ నగర్‌కు చెందిన మోతె రామకిషన్, శ్రీనివాస కాలనీకి చెందిన మామిడాల రితిన్, రాజనాయక్ తండాకు చెందిన లూనావత్ వెంకటేష్‌లుగా గుర్తించి విచారించినట్లు తెలిపారు. మోతె రామకిషన్ సీలేరు ప్రాంతం నుంచి గంజాయిని కొనుగోలు చేసి తీసుకుస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల తీసుకొచ్చిన గంజాయిని సూర్యాపేటలో విక్రయించడానికి సూర్యాపేట పట్టణంలోని కొత్త వ్యవసాయ మార్కెట్ వద్దకు గంజాయితో రాగా.. ఈ ముగ్గురిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు. వారి నుంచి రెండు బైక్‌లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు చెప్పారు.
కోతుల దాడిలో
ఇద్దరికి గాయాలు
అర్వపల్లి: కోతుల దాడిలో ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. ఈఘటన అర్వపల్లిలో పోలీస్‌స్టేషన్ రోడ్డులోని జెడ్పీహెచ్‌ఎస్ సమీ పంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. అర్వపల్లిలో తాడూరి యాదగిరి కుమారుడు మనువర్మ, పురంశెట్టి తన్వికసాయి ఇద్దరు కలిసి ఆడుకుంటుండగా సమీపంలో ఉన్న కోతులు ఒక్కసారిగా వచ్చి దాడి చేశారు. దీంతో వారికి గాయాలయ్యాయి. చిన్నారులను వారి తల్లిదండ్రులు స్థానిక పీహెచ్‌సీకి తీసుకెళ్లి వైద్య చికిత్స చేయించారు.


