వెయ్యి మందితో నిఘా
ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఇక అభ్యర్థులు ఎవరు కూడా ప్రచారం నిర్వహించకూడదు. సెల్‌ఫోన్‌లో కూడా ఎన్నికల ప్రచారం చేయవద్దు. నిబంధనలు పాటించాలి. ఉల్లంఘించి ప్రచారం నిర్వహిస్తే చర్యలు తీసుకుంటాం. కేసులు నమోదైతే అభ్యర్థిత్వం కోల్పోతారు. సాయంత్రం 5 గంటల తర్వాత నుంచి ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు సైలెన్స్‌డేస్‌గా పరిగణించాలి. ఈ సమయంలో ఓటర్లు కానివారు, స్థానికేతరులు వార్డుల్లో సంచరించకూడదు. ఉచితాలు, బహుమతులు, డబ్బు మద్యం లాంటి వాటితో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే చర్యలు తప్పవు.
సాక్షి, యాదాద్రి : ‘జిల్లాలోని భువనగిరి, చౌటుప్పల్, ఆలేరు, యాదగిరిగుట్ట, పోచంపల్లి, మోత్కూరు మున్సిపాలిటీలకు ఈ నెల 11న నిర్వహించే ఎన్నికలకు వెయ్యి మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాం. పోలింగ్, కౌంటింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు గట్టి నిఘా ఉంచాం. ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకోవడానికి పటిష్ట చర్యలు తీసుకున్నాం’ అని ఎస్పీ అక్షాంశ్ యాదవ్ పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లను సోమవారం ఆయన సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ఆరు మున్సిపాలిటీల్లోని 102 వార్డుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా పటిష్ట భద్రతా చర్యలు తీసుకున్నాం. పోలింగ్ నిర్వహణకు ప్రత్యేక నిఘా బృందాలు ఏర్పాటు చేశాం. అదనపు ఎస్పీ, డీస్పీల ఆధ్వర్యంలో ప్రత్యేక ఫోర్స్ అనుక్షణం అప్రమత్తంగా పనిచేస్తుంది. మున్సిపాలిటీల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాం. 102 వార్డుల్లోని 208 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించనుండగా 51 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించాం. డీఎస్పీ స్థాయి అధికారి స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అధికారిగా ఉంటారు. ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్స్ విధులు నిర్వర్తిస్తుంది. ప్రతి మున్సిపాలిటీలో ఫ్లయింగ్ స్క్వాడ్ విధులు నిర్వహిస్తుంది. ప్రతి మున్సిపాలిటీలో స్టాటిస్టికల్ సర్వేలెన్స్ టీమ్స్ ఉంటాయి. ప్రతి మున్సిపాలిటీకి ఒక మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీం ఉంది.
ఎన్నికలను జిల్లా ఎలక్షన్ సెల్ ద్వారా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తాం. బందోబస్తు నిర్వహణ మొదలుకుని ఎన్నికల సామగ్రికి భద్రత కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. వీటిని జిల్లా పోలీస్ కార్యాలయంలోని సెంట్రల్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేశాం. వీటి ద్వారా నిత్యం పర్యవేక్షణ ఉంటుంది.
గత ఎన్నికల్లో నేరాలకు పాల్పడ్డ వారిని గుర్తించి 73 మందిని ముందస్తుగా బైండోవర్ చేశాం. ఎవరైనా బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే అలాంటి వారిని హామీ పూచీకత్తు నగదు రూ.5 లక్షల వరకు జరిమానాగా విధిస్తాం. లైసెన్స్ కలిగిన 5 ఆయుధాలను తాత్కాలికంగా స్వాధీనం చేసుకున్నాం. 29 కేసుల్లో రూ.2.57 లక్షల విలువైన 357 లీటర్ల మద్యం సీజ్ చేశాం. భువనగిరిటౌన్, పోచంపల్లిలో రూ.5.90 లక్షల నగదును సీజ్ చేశాం. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన విషయంలో ఒక కేసు నమోదు చేశాం
ఎన్నికల సంఘం సూచించిన నియమ నిబంధనల ప్రకారం ఆరు మున్సిపాలిటీల్లో ఎన్నికల సామగ్రికి పటిష్ట భద్రత కల్పిస్తాం. భువనగిరి దివ్యబాల పాఠశాలలో పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులు భద్ర పరుస్తాం. ఆర్ముడ్ పోలీసుల పహారాలో స్ట్రాంగ్ రూమ్‌లు ఏర్పాటు చేసి రక్షణ కల్పిస్తున్నాం. అలాగే ఎన్నికల సామగ్రి తరలింపులో ఎన్నికల నిర్వహణ అధికారులతోపాటు రూట్ మొబైల్ సిబ్బంది భద్రతగా ఉంటారు.
ఫ ప్రశాంతంగా మున్సిపల్ పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు
ఫ స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకోవాలి
ఫ ఎన్నికల నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి
ఫ ఎస్పీ అక్షాంశ్‌యాదవ్
కేటాయించిన సిబ్బంది
అదనపు ఎస్పీలు 01
డీఎస్పీలు 04
ఇన్‌స్పెక్టర్లు 11
సబ్ ఇన్‌స్పెక్టర్లు 37
స్ట్రైకింగ్ ఫోర్స్ టీమ్స్ 06
స్పెషల్ స్ట్రైకింగ్
ఫోర్స్ టీమ్స్ 06
ఏఆర్ ఫోర్స్ 213
ఇతర సిబ్బంది 600
వెయ్యి మందితో నిఘా


