ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
గుండాల: పెద్దపులి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ మోత్కూరు సెక్షన్ ఆఫీసర్ కె.ఎల్లేష్ సూచించారు. గురువారం గుండాల మండలం వెల్మజాల గ్రామంలో రైతులు పడకంటి నరేందర్, పడకంటి శ్రీను, జోలం పాండు వ్యవసాయ భూమిలో పులి సంచరించినట్లు గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో గ్రామానికి వచ్చిన ఫారెస్ట్ అధికారులు పాద ముద్రలను పరిశీలించారు. ఇవి పులిపాదముద్రలే అని నిర్ధారించారు. ఈ సందర్భంగా ఎలేష్ మాట్లాడుతూ రైతులు ఎవరూ రాత్రి వేళల్లో ఒంటరిగా వ్యవసాయ బావుల వద్దకు వెళ్ల వద్దన్నారు. పశువులు, గొర్రెలు, మేకలను ఇళ్ల వద్దకు తెచ్చుకోవాలని సూచించారు. ఆయన వెంట ఫారెస్ట్ అధికారి పి.శ్రీనివాస్, సర్పంచ్ కుర్మిళ్ల కవితశ్రీనివాస్, మాజీ సర్పంచ్ దాస ప్రసాద్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
పల్లెల్లో డప్పు చాటింపు
ఆత్మకూరు(ఎం): చుట్టు పక్కల మండలాల్లో పులి సంచారం నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయడానికి ఆత్మకూర్(ఎం) మండలంలోని పలు గ్రామాల్లో సర్పంచ్‌లు దండోరా వేయించారు. పోతిరెడ్డిపల్లి, పారుపల్లి, పల్లెపహాడ్, రహీంఖాన్ పేట, కొరటి కల్, టి. రేపాక, ఉప్పలపహాడ్ తదితర గ్రామాల్లో బుధవారం రాత్రి డప్పు చాటింపు చేశారు. దీంతో వ్యవసాయ బావుల వద్ద నుంచి పశువులను తోలుకెళ్లి ఇళ్లవద్దనే కట్టేశారు. గ్రామాలకు దూరంగా ఉన్న పాఠశాలకు కాలినడకన, సైకిళ్లపై విద్యార్థులు వెళ్లడంలేదు.
అవగాహన కల్పిస్తున్న అధికారులు
ఆత్మకూరు(ఎం) మండలం పారుపల్లి, పల్లెపహాడ్‌లో భువనగిరి అటవీ శాఖ అధికారులు గురువారం పర్యటించారు. పులి అడుగుల జాడ కోసం పలు మామిడి తోటలు, పొలాలను పరిశీలించారు. అనంతరం ప్రజలకు అవగాహన కల్పించారు. ఫారెస్టు అధికారులు డి. మోహన్ బాబు, కె. మల్లేష్, జి. లక్ష్మణ్ మాట్లాడుతూ రైతులు ఒంటరిగా వ్యవసాయ పనులకు వెళ్లొద్దని, సాయంత్రం 5లోపు పనులు ముగించుకుని ఇంటికి రావాలని సూచించారు.
మా అబ్బాయి ఎల్లబోయిన చరణ్ కొరటికల్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నారు. గ్రామం నుంచి స్కూల్ రెండు కిలో మీటర్ల దూరం ఉంటుంది. రోజూ సైకిల్‌పై వెళ్లేవాడు. పులి సంచరిస్తున్నట్లు తెలియడంతో పాఠశాలకు పంపించడంలేదు.
– ఎల్లబోయిన శ్రీశైలం, పోతిరెడ్డిపల్లి.
ఫ ఫారెస్ట్ అధికారుల సూచన
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి


