నాటకీయ పరిణామాల మధ్య చౌటుప్పల్‌ 17వ వార్డు ఏకగ్రీవం | - | Sakshi
Sakshi News home page

నాటకీయ పరిణామాల మధ్య చౌటుప్పల్‌ 17వ వార్డు ఏకగ్రీవం

Feb 4 2026 8:23 AM | Updated on Feb 4 2026 8:23 AM

నాటకీయ పరిణామాల మధ్య చౌటుప్పల్‌ 17వ వార్డు ఏకగ్రీవం

నాటకీయ పరిణామాల మధ్య చౌటుప్పల్‌ 17వ వార్డు ఏకగ్రీవం

చౌటుప్పల్‌ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు మంగళవారం నాటకీయ పరిణామాల మధ్య ఏకగ్రీవమైంది. వార్డుకు కాంగ్రెస్‌ నుంచి చింతల సాయిలు భార్య ఉమామహేశ్వరి, పస్తం గంగరాములు భార్య మల్లమ్మ టికెట్‌ ఆశించారు. పార్టీ అధిష్టానం పస్తం మల్లమ్మను అభ్యర్థిగా ఖరారు చేసింది. దాంతో అలక బూనిన చింతల ఉమామహేశ్వరి ఒక సెట్‌ నామినేషన్‌ కాంగ్రెస్‌ తరఫున, మరో సెట్‌ బీఆర్‌ఎస్‌ తరఫున దాఖలు చేసింది. కాంగ్రెస్‌ పార్టీ మల్లమ్మను అభ్యర్థిగా ప్రకటించడంతో మూడు రోజుల క్రితం ఉమా మహేశ్వరి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరింది. ఈ వార్డు నుంచి నామినేషన్‌ వేసిన మిగతా వారు ఉపసంహరించుకోగా మంగళవారం నాటికి ఇద్దరే మిగిలారు. బీఫామ్‌ సమర్పించే క్రమంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. చింతల ఉమామహేశ్వరికి బీఆర్‌ఎస్‌ పార్టీ బీఫామ్‌ అందించింది. అదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీ కూడా ఆమెకే బీఫామ్‌ అందింది. ఈ విషయంలో కాంగ్రెస్‌ నాయకుల వ్యూహాన్ని బీఆర్‌ఎస్‌ నాయకులు పసిగట్టలేక పోయారు. కాంగ్రెస్‌ నాయకుల వ్యూహం ప్రకారం బీఫామ్‌ సమర్పించే సమయంలో మల్లమ్మ నేరుగా ఆర్వో వద్దకు వెళ్లి తన నామినేషన్‌ ఉపసంహరించుకుంది. దాంతో ఉమామహేశ్వరి ఒక్కరే మిగలడంతో అధికారులు ఆమె ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ప్రకటించారు. విషయాన్ని పసిగట్టిన బీఆర్‌ఎస్‌ నాయకులు ఆర్వో కార్యాలయంలోకి వెళ్లి ఆయనతో వాగ్వాదానికి దిగారు. అదే క్రమంలో కాంగ్రెస్‌ శ్రేణులు సైతం ఎదురు దాడి చేశారు. 13వ వార్డును సైతం ఏకగ్రీవం చేసేందుకు కాంగ్రెస్‌ నాయకులు విశ్వ ప్రయత్నాలు చేశారు. బీఆర్‌ఎస్‌ నుంచి నామినేషన్‌ వేసిన తొర్పునూరి నర్సింహగౌడ్‌తో నామినేషన్‌ ఉపసంహరింపజేశారు. మరో ఇద్దరి చేత ఉపసంహరింపజేసేందుకు యత్నించగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి వారిని తన వాహనంలో తీసుకొని వెళ్లిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement