గుట్టలో చాగంటి ‘నృసింహ వైభవం’
యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం సాయంత్రం ఆధ్యాత్మిక ప్రవచన కర్త, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు నృసింహ వైభవంపై ఆధ్యాత్మిక ప్రవచనం నిర్వహించారు. యాదగిరీశుడిని దర్శించుకున్న చాగంటి కోటేశ్వరరావుకు ఆలయ అర్చకులు సంప్రదాయంగా స్వాగతం పలికారు. స్వామిని దర్శించుకున్న అనంతరం ఆలయ సాంస్కృతిక వేదికపై నృసింహస్వామి వైభవంపై ఆయన ప్రవచనం చేశారు. అంతకుముందు చాగంటి కోటేశ్వరరావుకు కలెక్టర్ హనుమంతరావు, ఆలయ ఈఓ భవానీ శంకర్, అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి స్వాగతం పలికారు.
కడుపునొప్పి భరించలేక ఆత్మహత్య
భువనగిరి(బీబీనగర్) : కడుపునొప్పి భరించలేక ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బీబీనగర్ మండలంలోని రావిపహాడ్ గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది. శనివారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రావిపహాడ్ గ్రామానికి చెందిన మైలారం శంకరయ్య(35) కొద్దిరోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. శుక్రవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన శంకరయ్య చాలాసేపటి వరకు ఇంట్లోకి తిరిగి రాలేదు. దీంతో అతడి భార్య నవనీత బయటకు వెళ్లి చూడగా ఇంటి వరండా పైకప్పుకు చున్నీతో ఉరేసుకుని కనిపించాడు. చుట్టుపక్కల వారి సహాయంతో శంకరయ్యను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శనివారం మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
చౌటుప్పల్ : హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామ శివారులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ పట్టణ కేంద్రానికి చెందిన మహమ్మద్ ఖాజా ఫయాజుద్దీన్(35) హైదరాబాద్‌లోని టోలిచౌకీ ప్రాంతంలో నివాసముంటున్నాడు. శనివారం బైక్‌పై నల్లగొండకు బయల్దేరాడు. మార్గమధ్యలో చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామ శివారులో ఆరెగూడెం క్రాస్‌రోడ్డు వద్ద ఓ లారీని డ్రైవర్ ఎలాంటి సిగ్నల్ ఇవ్వకుండా అకస్మాత్తుగా యూటర్న్ చేశాడు. వెనుకనే వస్తున్న ఫయాజుద్దీన్ బైక్ వెళ్లి లారీకి తగలడంతో రోడ్డుపై పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో చౌటుప్పల్ ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడి తమ్ముడు మహమ్మద్ ఖాజా ఫహీముద్దీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు.
టిప్పర్‌ను ఢీకొట్టిన లారీ.. ఒకరు మృతి
భువనగిరి(బీబీనగర్) : టిప్పర్‌ను వెనుక నుంచి ఇసుక లోడుతో వెళ్తున్న లారీ ఢీకొనడంతో లారీలో కూర్చున్న వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామ శివారులో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బొమ్మలరామారం మండలం నాగినేనిపల్లి గ్రామం నుంచి బీబీనగర్ వైపు వస్తున్న టిప్పర్‌ను బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామ శివారులో ఇసుక లోడుతో వెళ్తున్న లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీలో కూర్చున్న బాలే(40), ఒరిస్సా రాష్ట్రానికి చెందిన హరిలాల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం బీబీనగర్ ఎయిమ్స్‌కు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ బాలేం మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
చిన్నలక్ష్మాపురంలో పులి అడుగు జాడ
ఫ ఽద్రువీకరించిన ఫారెస్ట్ అధికారులు
తుర్కపల్లి : మండలంలోని చిన్నలక్ష్మాపురం గ్రామ శివారులో పులి సంచారం కలకలం రేపుతోంది. గ్రామ సమీపంలోని దూబల ధర్మారెడ్డి బావి వద్ద పులి అడుగు జాడలను శనివారం అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో చిన్నలక్ష్మాపురం, పొట్టిమర్రితండా, గోపాలపురం గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. అడవికి ఆనుకొని ఉన్న బావుల వద్దకు, పశువులను మేపేందుకు ఒంటరిగా వెళ్లవద్దని పేర్కొన్నారు. పులి కదలికపై నిరంతరం నిఘా కొనససాగిస్తున్నామని తెలిపారు. వాసాలమర్రి గ్రామ శివారులోని మర్రిచెట్టు వద్ద పెద్దపులి కనిపించినట్లు టిప్పర్ డ్రైవర్ తెలిపారు. వాసాలమర్రి పెట్రోల్ బంక్ సమీపంలోని నాగదేవత గుడి వద్ద అడవిపందిని వేటాడిన అనంతరం దయ్యంబండ వైపునకు వెళ్లినట్లు ఆయన పేర్కొన్నారు. రెండు రోజుల కిత్రం వాసాలమర్రి సమీపంలోని తిరుమలపురం అడవుల నుంచి శ్రీనివాస్‌పురం వైపునకు పెద్దపులి వెళ్లినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. అయితే అదే మార్గంలో తిరిగి వెనక్కి వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు.
గుట్టలో చాగంటి ‘నృసింహ వైభవం’
గుట్టలో చాగంటి ‘నృసింహ వైభవం’


