సోషల్ మీడియా ఖాతాలపై నిఘా
భువనగిరిటౌన్ : మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సోషల్ మీడియా పాత్ర కూడా కీలకంగా మారింది. అభ్యర్థులు తమ ప్రచారానికి వేదికగా సోషల్ మీడియాను మార్చుకున్నారు. అయితే సోషల్ మీడియాలో పార్టీలు, కులాలు, మతాల పేరుతో ఇతరులను రెచ్చగొట్టేలా, ఘర్షణకు తావిచ్చేలా ఎవరూ పోస్టులు, కామెంట్స్ పెట్టినా కఠిన చర్యలు తప్పవని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. అభ్యర్థుల సోషల్ మీడియా అకౌంట్లపై ప్రత్యేక విభాగంతో నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇలాంటి వాటిపై నేరుగా తమ దృష్టికి తీసుకొచ్చినా చట్టపరంగా చర్యలు చేపడతామని తెలిపారు. అదేవిధంగా ప్రచారంలో భాగంగా ర్యాలీలు, సభలు, సమావేశాల నిర్వహణకు, నామినేషన్ల దాఖలు సమయంలో ర్యాలీలు, మీటింగ్‌లకు స్థానిక పోలీస్ స్టేషన్‌లో అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. లేందటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. లౌడ్ స్పీకర్లు, ప్రచారం కోసం వినియోగించే వాహనాలకు సైతం అనుమతి తీసుకోవాలని అన్నారు. ఉదయం 6గంటల నుంచి రాత్రి 10గంటల వరకే ప్రచారానికి అనుమతి ఉందని, దీనిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రత్యేక బృందాల తనిఖీ
భువనగిరిటౌన్ : మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో పోలీసులు, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది, రెవెన్యూ బృందాలతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వైలెన్స్ టీంలు రంగంలోకి దిగాయి. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీ చేస్తున్నారు. అయితే ఈ బృందాలకు అవసరమైతే ఇళ్లు, హోటళ్లలో సైతం తనిఖీలు చేసే అధికారం ఉంటుంది. దీంతో రూ.50వేల కంటే ఎక్కువ నగదు, బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, ఇతర సామగ్రి తీసుకెళ్లేవారు సరైన ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. ఎటువంటి ఆధారాలు చూపకపోతే ఆ నగదు, సామగ్రిని అధికారులు స్వాధీనం చేసుకుని సంబంధిత అధికారులకు అప్పగిస్తారు. ఎన్నికలు ముగిసిన తర్వాత సరైన ఆధారాలు చూపి నగదు, సామగ్రిని తీసుకోవాల్సి ఉంటుంది.
చెక్‌పోస్టు ఏర్పాటు
మోత్కూరు : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మోత్కూరులోని రాజన్నగూడెం గ్రామ స్టేజీ వద్ద గురువారం ఎస్‌ఎస్ టీమ్ చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. మండల పరిషత్ సూపరింటెండెంట్ దయాకర్, పోలీస్ కానిస్టేబుల్, వీడియోగ్రాఫర్ టీమ్‌గా ఏర్పడి తనిఖీలు చేస్తున్నారు.
సోషల్ మీడియా ఖాతాలపై నిఘా


