గృహ విద్యుత్ మీటర్లు లేవు
నల్లగొండ : టీజీ ఎస్‌పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ మీటర్ల కొరత ఏర్పడింది. దీంతో రెండు నెలలుగా నూతన గృహ కనెక్షన్ల జారీ నిలిచిపోయింది. దీంతో పాటు కాలిపోయిన, స్టకప్ అయిన మీటర్ల స్థానంలో కొత్త వాటిని అమర్చాల్సి ఉన్నా.. మీటర్లు లేని కారణంగా వినియోగదారులు పాత బిల్లులనే చెల్లిస్తూ నష్టపోతున్నారు. టీజీ ఎస్‌పీడీసీఎల్ స్థాయిలో మీటర్లు కొనుగోలు చేసి ఎక్కడికక్కడ జిల్లాల్లో సిద్ధంగా ఉంచాలి. వినియోగదారులు మీటర్ల కోసం ఆన్‌లైన్‌లో డీడీలు కట్టి దరఖాస్తు చేసుకోగానే మీటర్ బిగించి విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలి. కానీ మీటర్లు లేకపోవడంతో కొత్తగా ఇళ్లు నిర్మించుకునే వారు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఎప్పుడూలేని విధంగా ఇలాంటి పరిస్థితి ఎదురైందంటే అధికారుల నిర్లక్ష్యం ఏవిధంగా ఉందో అర్థమవుతోంది.
776 మీటర్లు పెండింగ్..
టీజీఎస్‌పీడీసీఎల్ పరిధిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరిలో పలు విద్యుత్ శాఖ సెక్షన్లు ఉన్నాయి. వీటి పరిధిలో విద్యుత్ కనెక్షన్ల కోసం ఈ ఏడాది జనవరి 1 వరకు వెయ్యి మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు కొన్ని కనెక్షన్లు రిలీజ్ చేశారు. ఇంకా మీటర్ల కోసం దరఖాస్తు చేసుకుని కనెక్షన్ల కోసం ఎదురు చూస్తున్నవారు 776 మంది ఉన్నారు.
టీజీఎస్‌పీడీసీఎల్ పరిధిలో
రెండు నెలలుగా ఆగిన కనెక్షన్ల జారీ
ఉమ్మడి జిల్లాలో మీటర్ల కోసం
776 దరఖాస్తులు పెండింగ్
ఇబ్బందుల్లో నూతన గృహాల
నిర్మాణదారులు
నిలిచిపోతున్న నూతన గృహ నిర్మాణాలు
కొత్తగా ఇళ్లు నిర్మించుకునేవారు విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నా.. మీటర్లు లేకపోవడంతో నెలల తరబడి కనెక్షన్లు ఇవ్వడం లేదు. దీంతో వారు పక్కింటి వారిపై ఆధారపడాల్సి వస్తోంది. అలాంటి అవకాశం లేనివారు నిర్మాణాన్ని నిలిపివేస్తున్నారు. కొన్నిచోట్ల పాత మీటర్లు స్ట్రకప్ అవుతాయి. కొన్ని కాలిపోతాయి. అలాంటి మీటర్లను పరీక్షించి దాని స్థానంలో కొత్తవాటిని అమర్చాలి. ప్రస్తుతం అవి కూడా చేయలేని పరిస్థితి ఉంది.


