కనుల పండువగా రథసప్తమి వేడుకలు
అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం సమీపంలోని అఖండ జ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో ఆదివారం రథసప్తమి వేడుకలు కనుల పండువగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే సుప్రభాతసేవ, అభిషేకం, అలంకరణ వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బెంగళూరుకు చెందిన సైకిల్ ప్యూర్ అగర్‌బత్తి కంపెనీ రూపొందించిన 6 ఫీట్ల అగర్‌బత్తిని ఆలయంలో ఆ కంపెనీ ప్రతినిధులు వెలిగించారు. 25వేల మందికి పైగానే భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మహిళలు ధ్వజ స్తంభం వద్ద దీపాలు వెలిగించి ప్రదక్షిణలు చేసి స్వామిని దర్శించుకున్నారు. ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి, ఏఎస్పీ రవీందర్‌రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ మణిమాల, డీసీసీ ఉపాధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది దరూరి యోగానందచారి, అర్వపల్లి దేవాలయ చైర్మన్ అనిరెడ్డి రాజేందర్‌రెడ్డి తదితరులు స్వామిని దర్శించుకున్నారు. ఆయా పూజల్లో క్షేత్ర వ్యవస్థాపకురాలు కాకులారపు రజితాజనార్దన్, గణపురం నరేష్, బాలమురళీకృష్ణ, ఇంద్రారెడ్డి, జైపాల్‌రెడ్డి, యాదగిరి, వినయ్, పూర్ణ, నిక్కి, అర్చకులు పాల్గొన్నారు.
భువనగిరి : పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో ఆదివారం రథసప్తమి వేడుకలను ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఉదయం సూర్యప్రభ వాహనం, చిన్నశేష వాహనం, గజ వాహనం, హనుమంత వాహనం, కల్పవృక్ష వాహనం, సాయంత్రం చంద్రప్రభ వాహనం, గరుడ వాహనంపై ఆలయ మాడ వీదుల్లో స్వామివారిని ఊరేగించారు. చిన్నారులు, మహిళలు చేసిన భరతనాట్యం, కూచిపూడి నృత్య ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. భక్తులు ఆలయానికి పోటెత్తారు. రాత్రి వరకు స్వామి వారిని దర్శించుకున్నారు. ఆయా పూజా కార్యక్రమాల్లో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు మానేపల్లి రామారావు తదితరులు పాల్గొన్నారు.
కనుల పండువగా రథసప్తమి వేడుకలు


