బడికి వెళ్లినా బతుకుదురేమో బిడ్డలు..
మర్రిగూడ : బడికి వెళ్లినా బతుకుదురేయో బిడ్డా.. అంటూ హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఫర్నీచర్ షాపులో జరిగిన అగ్నిప్రమాదంలో మృతిచెందిన ప్రణీత్(11), అఖిల్(7) తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మర్రిగూడ మండలం యరగండ్లపల్లి గ్రామానికి చెందిన తోకల యాదయ్య ఉపాధి నిమిత్తం 23 ఏళ్లుగా హైదరాబాద్‌లో ఉంటూ ఫర్నీచర్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడి భార్య లక్ష్మమ్మ ఇళ్లలో పనిచేస్తూ భర్తకు చేదోడువాదోడుగా ఉండేది. వారి కుమారులు ప్రణీత్, అఖిల్ అక్కడే ఓ పాఠశాలలో 6, 2వ తరగతి చదువుతున్నారు. యాదయ్య కుటుంబం నాంపల్లిలోని ఓ ఫర్నీచర్ షాపు భవనంలో నివాసముంటున్నారు. యాదయ్య కూడా ఆ ఫర్నీచర్ షాపులోనే పనిచేస్తున్నాడు. రోజుమాదిరిగానే శనివారం కూడా లక్ష్మమ్మ ఇళ్లలో పనికి వెళ్లింది. రోజూ పిల్లలిద్దరిని పాఠశాలకు తీసుకెళ్లే యాదయ్య ఫర్నీచర్ పని నిమిత్తం వేరే ఊరికి వెళ్లాడు. దీంతో పాఠశాలకు ఆలస్యమైందని ఇద్దరు చిన్నారులు ఇంటి వద్దనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఫర్నీచర్ షాపులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇద్దరు చిన్నారులు ఆ మంటల్లో చిక్కుకుని ఊపిరి ఆడక మృతిచెందారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బడికి వెళ్లినా బతుకుదురు కదా బిడ్డలారా అని తల్లిదండ్రుల ఆర్తనాదాలు, కుటుంబ సభ్యుల ఆక్రందనలు యరగండ్లపల్లి గ్రామంలోని ప్రతిఒక్కరిని కంటతడి పెట్టించాయి. ఆదివారం సాయంత్రం చిన్నారుల అంత్యక్రియలు స్వగ్రామంలో నిర్వహించారు.
హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఫర్నీచర్ షాపులో
అగ్నికి ఆహుతైన చిన్నారుల తల్లిదండ్రుల రోదన
మృతుల స్వస్థలం మర్రిగూడ మండలం యరగండ్లపల్లి
స్వగ్రామంలో అంత్యక్రియలు పూర్తి
బడికి వెళ్లినా బతుకుదురేమో బిడ్డలు..


