ఆలేరులో ఎన్‌సీసీ క్యాడెట్‌లకు పరీక్షలు
● పాల్గొన్న 99మంది క్యాడెట్లు
● ఆర్మీ అధికారుల పర్యవేక్షణలో
ఎస్‌ఎల్‌ఆర్, మ్యాప్ రీడింగ్‌పై టెస్టులు
ఆలేరు : వరంగల్‌లోని పదో బెటాలియన్ ఆధ్వర్యంలో ఎన్‌సీసీలో రెండేళ్ల శిక్షణ పూర్తిచేసుకున్న ఆలేరు, జనగామ జిల్లాలోని పోచన్నపేట, దేవరుప్పల ఉన్నత పాఠశాలలకు చెందిన 99మంది ఎన్‌సీసీ క్యాడెట్లకు ఆలేరు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం ఏ సర్టిఫికెట్ల కోసం బ్యాటిల్, ఫీల్డ్ క్రాఫ్ట్‌లపై ఆర్మీ తరహా పరీక్షలను నిర్వహించారు. ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 2.30గంటల వరకు రెండు విడతలుగా ఆర్మీ అధికారుల పర్యవేక్షణలో ఈ పరీక్షలు జరిగాయి. ఉదయం నుంచి 10గంటల వరకు రాత పరీక్ష, 10.30 నుంచి మధ్యాహ్నం 2.30 వరకు ప్రాక్టికల్స్ నిర్వహించారు. ప్రాక్టికల్స్‌లో భాగంగా సెల్ఫ్ లోడెడ్ రైఫిల్(ఎస్‌ఎల్‌ఆర్)ను ఉపయోగించే విధానం, అడవిలోకి వెళ్లినప్పుడు శత్రువుల జాడ కనుగొనడం, కంపాస్ ద్వారా మ్యాప్ రీడింగ్, ట్రెక్కింగ్, పరేడ్, సెల్యూట్, అత్యవసర పరిస్థితుల్లో సమయస్ఫూర్తితో ఎలా వ్యవహరించాలనే పరీక్షలను క్యాడెట్‌లకు నిర్వహించారు. ఆర్మీ చరిత్ర, సామాజిక బాధ్యత, వ్యక్తిత్వ వికాసం, ఆరోగ్యం, పరిశుభ్రత తదితర అంశాలపై రాత పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నాయబ్ సుబేదార్ మగ్దూం మారుతి మాట్లాడుతూ.. క్రమశిక్షణ, జాతీయ సమైక్యత, నాయకత్వ పటిమను పెంపొందించి ఉత్తమ లక్షణాలు గల యువతను దేశానికి అందించడమే ఎన్‌సీసీ ప్రధాన లక్ష్యమన్నారు. ఎన్‌సీసీ ద్వారా దేశ, సామాజిక సేవలో భాగస్వామ్యమయ్యే అవకాశం కలుగుతుందన్నారు. ఎన్‌సీసీ ప్రిసైడింగ్ అధికారి దూడల వెంకటేష్ మాట్లాడుతూ.. వివిధ గ్రేడ్‌ల ఎన్‌సీసీ సర్టిఫికెట్లను పొందిన క్యాడెట్లకు త్రివిధ దళాలలో, ఉద్యోగ, ఉన్నత విద్య అవకాశాల్లో అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఆర్మీ అధికారులు మూర్తి, ఉమేష్, ఫస్ట్ ఆఫీసర్ బాలారెడ్డి, థర్డ్ ఆఫీసర్ కృష్ణ, సీటీఓ నాగేందర్, వరంగల్ పదో బెటాలియన్ అధికారులు, సీనియర్ క్యాడెట్లు వినయ్, మనోజ్, శ్రీరామ్, శ్రీశాంత్, భరత్, జయశ్రీ పాల్టొన్నారు.
ఆలేరులో ఎన్‌సీసీ క్యాడెట్‌లకు పరీక్షలు


