చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలు షురూ
నార్కట్‌పల్లి : రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు ఆలయ ఈఓ మోహన్‌బాబు, దేవాలయ ప్రధాన అర్చకుడు రామలింగేశ్వరశర్మ, అర్చక బృందం పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మహా మండపంలో నిర్వహించిన పూజల్లో ఎమ్మెల్యే వీరేశం పాల్గొన్నారు. ఆ తర్వాత అర్చకులు అల్లవరపు సుబ్రహ్మణ్యదీక్షితావధాని శాస్త్రి, అల్లవరపు కార్తీక్‌శర్మ, రాజశేఖర్‌శర్మ, దేవాలయ ప్రధాన అర్చకులు పోతులపాటి రామలింగేశ్వరశర్మ, సురేష్‌శర్మ, శ్రీకాంత్‌శర్మ, సతీష్‌శర్మ, నాగయ్యశర్మ తదితరులు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచం, దీక్షాదహణ, ఏకాదక్ష రుద్రాభిషేకం, నీరాజన మంత్రపుష్పములు తదితర పూజలతో బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. ముఖ్యఅతిథులను ఈఓ మోహన్‌బాబు సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డికి చెర్వుగట్టు ఆలయ విశిష్టతను తెలియజేసి ప్రత్యేక నిధులు కేటాయించి భక్తుల సౌకర్యార్ధం ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్గకుండా దేవాలయ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వరరావు, సర్పంచ్ నేతగాని కృష్ణ, ఉత్సవ కమిటీ చైర్మన్ వరాల రమేష్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బత్తుల ఉషయ్య, సర్పంచ్ జేరిపోతుల భరత్, ఉప సర్పంచ్ జలంధర్‌రెడ్డి, బండ సాగర్‌రెడ్డి, గడుసు శశిధర్‌రెడ్డి, పున్నపురాజు యాదగిరి, రేగట్టే నవీన్‌రెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు కమ్మలపల్లి మల్లేశం, ప్రజ్ఞాపురం సత్యనారాయణ, ఇరుకుల సంపత్, రేగట్టే శ్రీనివాస్‌రెడ్డి, గద్దగోటి యాదయ్య, రంగ శ్రవణ్, మందుల నరసింహ, కొమ్ము శ్రీను, గౌరుదేవి లక్ష్మయ్య, గడ్డం పశుపతి, సూర ఆంజనేయులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
ముఖ్యఅతిథిగా హాజరైన
ఎమ్మెల్యే వేముల వీరేశం
చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలు షురూ


